వృక్షో రక్షతి రక్షితః

జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్‌ డార్విన్‌ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్‌ బొటానిక్‌ గార్డెన్స్‌ ఇటీవల సాకారం చేసింది.

Published : 06 Dec 2023 00:11 IST

జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్‌ డార్విన్‌ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్‌ బొటానిక్‌ గార్డెన్స్‌ ఇటీవల సాకారం చేసింది. మొక్కల సమాచారాన్ని సమగ్రంగా గుదిగుచ్చి ‘స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్స్‌ ప్లాంట్స్‌ అండ్‌ ఫంగీ 2023’ నివేదికను సిద్ధం చేసింది. కానీ డార్విన్‌ కాలానికీ ఇప్పటికీ ప్రపంచం చాలా మారిపోయింది. కొత్తగా వేలాది మొక్కలు, శిలీంధ్రాలను గుర్తించినప్పటికీ చాలా జాతులు అంతర్ధాన దశలో ఉండటం విచారకరం.

నం మాత్రమేనా? వృక్షాలు, మొక్కలు, శీలింధ్రాలూ ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే మొత్తం 30 దేశాలకు చెందిన 200 మంది శాస్త్రవేత్తలు సమీక్షించి తయారుచేసిన తాజా నివేదికలో వీటి బాగోగులను, తీరు తెన్నులను నిక్షిప్తం చేశారు. దీనిలోని రెండు విషయాల గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఒకటి- పుష్పించే వాటిల్లో 45% మొక్కలకు అంతర్ధాన ముప్పు పొంచి ఉండటం. రెండోది- శాస్త్రీయంగా ఇంకా విశ్లేషించాల్సిన వాటిల్లో 77% మొక్కలు ఇప్పటికే అంతర్ధాన దశకు చేరుకోవటం. ఫంగస్‌ విషయంలో అవి కనుమరుగయ్యే ముప్పును అంచనా వేయటం కష్టమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ఫంగస్‌లో కేవలం 10% జాతుల వివరణలే అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కలన్నీ మొక్కలు, ఫంగస్‌ దీనావస్థనే విడమరుస్తున్నాయి.

కొత్తవి పుట్టుకొచ్చినా..

మొక్కలు, చెట్లు లేని ప్రపంచం ఎలా కనిపిస్తుంది? వీటిని ఎలా కోల్పోతున్నామనే దానిపై సమాధానం ఆధారపడి ఉంటుంది. పర్యావరణం ధ్వంసమై, తీవ్ర కరవు కాటకాలు సంభవిస్తే ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మొక్కలు పెరగలేని స్థితి నెలకొంటుంది. అవి పెరిగే చోటును కోల్పోతే అక్కడ కలుపు విపరీతంగా పెరగొచ్చు. పరిణామ క్రమంలో భాగంగా మొక్కలు, ఫంగస్‌ కోట్లాది సంవత్సరాలుగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. ఇప్పటి స్థితికి రావటానికి సుమారు 10 కోట్ల ఏళ్లు పట్టి ఉంటుందని అంచనా. అందువల్ల ఇవి నశిస్తే భర్తీ కావటం అసాధ్యం. నిజానికి సహజ పరిణామ క్రమంలో భాగంగా కోల్పోయిన జీవ వైవిధ్యాన్ని ప్రకృతి భర్తీ చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. కొత్త జాతులు పుట్టుకొస్తాయి. కానీ అవి మనకు మేలు చేస్తాయన్న నమ్మకం లేదు.

ఎందుకీ పరిస్థితి?

మొక్కలు, ఫంగస్‌ ఎందుకు అంతరిస్తున్నాయి? దీనికి ప్రధాన కారణం- వాటి ఆవాస ప్రాంతం తగ్గటమే. ఇప్పటివరకు గుర్తించిన అతి పెద్ద ప్రమాదం ఇదే. ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం తేట తెల్లమవుతుంది. వర్షాధార అడవుల స్థానంలో వ్యవసాయ నేల ఆవిర్భవించటం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఉపయోగపడే జాతులను అధికంగా సేకరించటం మరో కారణం. వాతావరణ మార్పు సరేసరి. ఇది అన్ని ప్రాకృతిక వనరులను ధ్వంసం చేసేస్తోంది. అయితే వాతావరణ మార్పుతో తలెత్తే జాతుల వినాశనాన్ని నమోదు చేయటం కష్టం. వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో వృక్ష జాతులు ఎలా ఉండేవనే దానికి సంబంధించి తగినంత సమాచారం లేదు. వాతావరణ మార్పు ఏ స్థాయిలో వృక్ష జాతులు అంతరించటానికి కారణమవుతుందో తెలియదు. లక్షలాది జాతుల్లో ఒక్కొక్క దాన్ని పరిశీలించటం సాధ్యం కాదు కూడా. ప్రస్తుతానికి మనం వాతావరణ మార్పు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్న మాట నిజమే అయినా దీన్ని ఒక్కదాన్నే కారణంగా చెప్పుకోలేం.

పరిష్కరించే మార్గముందా?

అంతరించి పోయే ముప్పు పొంచి ఉన్న మొక్కల జాబితాను రూపొందించటం కష్టం. దీని మీద శాస్త్రవేత్తలు ఇప్పటికే కృషి చేస్తున్నారు. 1900 సంవత్సరానికి ముందుతో పోలిస్తే ఇప్పుడు జాతులు అంతరించే వేగం రెట్టింపు అయ్యింది. కానీ ఎప్పుడు, ఏ జాతులు అంతరిస్తాయి అనేది చెప్పటం తేలిక కాదు. అలాగని పూర్తిగా చేతులు ఎత్తివేయనూ లేం. ఎప్పుడు అంతరిస్తాయనేది అంచనా వేయటం కన్నా ముప్పు తీవ్రతను గుర్తించటానికే శాస్త్రవేత్తలు ప్రాధాన్యమిస్తున్నారు. జీవ వైవిధ్య క్షీణతను తగ్గించటం మీద తక్షణం దృష్టి సారించాల్సి ఉందని సూచిస్తున్నారు. నశించిన వాటిని తిరిగి తెచ్చుకోలేకపోవచ్చు గానీ వీలైనంత వరకు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందుకు పర్యావరణ పరిస్థితులను దెబ్బతీయకుండా చూడటం చక్కటి మార్గం. ఎందుకంటే ఇది ఒక్క మొక్కలు, ఫంగస్‌నే కాదు.. అన్ని జీవజాతులనూ రక్షిస్తుంది. మనకు తెలిసిన జాతులనే కాదు, మనం గుర్తించని జాతులనూ కాపాడుకోవచ్చు.

ఎన్నెన్నో ప్రయోజనాలు

మొక్కలు, ఫంగస్‌ లేని ప్రపంచం మానవుల్లేని ప్రపంచంతో సమానం. మానవజాతి అన్నిదశల్లోనూ మొక్కలు ఆదుకుంటున్నాయి. అనాది నుంచీ ఆధారంగా నిలుస్తూ వస్తున్నాయి. మనం శ్వాస ద్వారా పీల్చే గాలిలోని ఆక్సిజన్‌ మొక్కలు, చెట్ల నుంచే లభిస్తుందని కొత్తగా చెప్పనక్కర్లేదు. తినే తిండి, ధరించే దుస్తులు, వేసుకునే మందులన్నీ వీటి పుణ్యమే. ప్రతి 10 మందుల్లో 9 మందులు మొక్కల నుంచే సంగ్రహిస్తుండటం గమనార్హం. చిన్నాచితకా సమస్యలకే కాదు.. తీవ్ర జబ్బుల మందులు సైతం వీటి నుంచి లభిస్తున్నాయి. రక్తక్యాన్సర్‌లో ఉపయోగించే మందులను అందించే మడగాస్కర్‌ పెరివింకిల్‌ (కాథరాంథస్‌ రోసియస్‌) దీనికి ఒక నిదర్శనం. మొక్కలు, ఫంగస్‌ వైవిధ్యం నశిస్తే భవిష్యత్తులో గణనీయమైన అవకాశాలను, ప్రయోజనాలనూ కోల్పోయినట్టే. ఉదాహరణకు- వెప్రిస్‌ ఓనానే మొక్క జాతులనే తీసుకోండి. వీటికి సూక్ష్మక్రిములను సమర్థంగా నిలువరించే గుణం ఉంటున్నట్టు ఏడాది క్రితమే గుర్తించారు. కామెరాన్‌లోని అడవుల్లో కనిపించే ఇవి ఇప్పటికే అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటున్నాయి. వీటి గుణాలను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం. ఈ తరుణంలోనే కనుమరుగైతే భవిష్యత్తులో వీటి ద్వారా లభించే ప్రయోజనాలను కోల్పోయినట్టే కదా. శిలీంద్రాలు సైతం ఔషధాలకు ఆధారంగా నిలుస్తున్నాయి. పెన్సిలిన్‌ దగ్గరి నుంచి కొలెస్ట్రాల్‌ తగ్గించే మందుల వరకూ ఎన్నెన్నో ఔషధాలను వీటి నుంచి తయారుచేస్తున్నారు. వీటిని ఇతర అవసరాలకూ వాడుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఫంగస్‌ ప్లాస్టిక్‌నూ జీర్ణం చేసుకోగలదు. అందువల్ల ఇవి కాలుష్య కారకాలను విచ్ఛిన్నం చేయటానికీ తోడ్పడతాయి. నిర్మాణ సామగ్రిగానూ ఉపయోగపడతాయి. కాబట్టే శాస్త్ర పరిశోధన రంగంలో మొక్కలు, ఫంగస్‌ రోజురోజుకీ ఆసక్తికరమైన అంశాలుగా మారుతున్నాయి.


కృత్రిమ కాంతితోనూ..

మొక్కలను కాపాడటానికి మన వంతు సాయమూ చేయొచ్చు. వీధి దీపాల వంటి కృత్రిమ కాంతిని తగ్గించుకోవటం ఇందులో ఒకటి. ఎందుకంటే కాంతి కాలుష్యం మొక్కల రుతు లయను దెబ్బతీస్తుంది. పరాగ సంపర్కానికి కారణమయ్యే తుమ్మెదలు, తేనెటీగలు, చిమ్మెట్ల వంటి జీవులతో వీటికి గల సంబంధాన్నీ చెడగొడుతుంది. జీవ గడియారం (సర్కేడియన్‌ రిథమ్‌) గల ప్రాణులన్నింటి మీదా కాంతి కాలుష్యం లేదా కృత్రిమ కాంతి ప్రభావం చూపుతుంది. జీవుల నిద్ర, మెలకువలను నియంత్రించేది జీవ గడియారమే. రాత్రిపూట సంచరించేవైనా, పగటి పూట తిరిగేవైనా జీవులన్నీ దీని మీదే ఆధారపడి ఉంటాయి. కృత్రిమ కాంతి మూలంగా రాత్రి సమయం తగ్గుతుంది. ఇది అంతర్గత వ్యవస్థలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఎంత ఎక్కువ కాలం జీవ గడియారం అస్తవ్యస్తమైతే అంత ఎక్కువ హాని కలుగుతుంది. మొక్కల్లో కాంతి గ్రాహకాలు (ఫొటోరిసెప్టర్లు) ఉంటాయి. ఇవి రోజు వ్యవధి వంటి వాటిని లెక్కించుకోవటానికి తోడ్పడతాయి. ఎప్పుడు పుష్పించాలో, ఎప్పుడు ఆకులు రాల్చాలో తెలుసుకోవటానికి దోహదం చేస్తాయి. మొక్కల జీవనకాలంలో ఈ రెండూ కీలకం. కృత్రిమ కాంతితో మొక్కలు ఒత్తిడికి గురవుతాయి. కిరణజన్య సంయోగక్రియ మరింత ఎక్కువగా జరుగుతుంది. ఇందుకోసం మరింత ఎక్కువగా శక్తిని వినియోగించుకోవటం వల్ల ప్రతిచర్యకారక ఆక్సిజన్‌ పుట్టుకొస్తుంది. ఇది మొక్కలు చనిపోవటానికి కారణమవుతుంది. కృత్రిమ కాంతి మూలంగా పరాగ సంపర్కానికి కారణమయ్యే తుమ్మెదల వంటి కీటకాల సంఖ్య కూడా తగ్గుతోంది. ఇదీ వృక్ష జీవ వైవిధ్యం దెబ్బతినటానికి కారణమవుతోంది. దీనికి తోడు వాతావరణ మార్పుతో చలికాలాలు వెచ్చగా, వేసవి కాలాలు సుదీర్ఘంగా కొనసాగుతూ రావటంతోనూ మొక్కల్లో సహజ లయ దెబ్బతింటుంది. అవి బలహీనపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని