ఫోన్‌ ఆటో రొటేట్‌ కాకపోతే?

స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు ఆటో-రొటేట్‌ ఫీచర్‌ బాగా ఉపయోగ పడుతుంది. ఫోన్‌ను పక్కలకు తిప్పగానే వీడియో అడ్డంగా తిరిగి, తెర నిండా కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఆటో-రొటేట్‌ సరిగా పనిచేయకపోవచ్చు. మరి ఈ సమస్యను పరిష్కరించటమెలా?...

Published : 03 Aug 2022 00:08 IST

స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు ఆటో-రొటేట్‌ ఫీచర్‌ బాగా ఉపయోగ పడుతుంది. ఫోన్‌ను పక్కలకు తిప్పగానే వీడియో అడ్డంగా తిరిగి, తెర నిండా కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఆటో-రొటేట్‌ సరిగా పనిచేయకపోవచ్చు. మరి ఈ సమస్యను పరిష్కరించటమెలా?

రీస్టార్ట్‌: ఇది చాలా తేలికైన పద్ధతి. ఫోన్‌ను రీస్టార్ట్‌ చేస్తే బగ్స్‌, చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆటో రొటేట్‌ సమస్య కూడా పరిష్కారమవుతుంది. రీసార్ట్‌ చేసినప్పుడు తాత్కాలిక ఫైళ్లన్నీ డిలీట్‌ అవుతాయి. దీంతో ఆటో రొటేట్‌ను అడ్డుకునే తాత్కాలిక ఫైళ్లు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. పవర్‌ బటన్‌ను ఎక్కువసేపు నొక్కి, రీస్టార్ట్‌ను ఎంచుకుంటే ఫోన్‌ ఆఫ్‌ అయ్యి, తిరిగి ఆన్‌ అవుతుంది. ఈ పద్ధతి పనిచేయకపోతే ఇతరత్రా చిట్కాలను పాటించి చూడొచ్చు.

సెటింగ్స్‌ ద్వారా ఆటో రొటేట్‌ ఆన్‌: మనం చాలావరకు ఫోన్‌ పైభాగాన కనిపించే డ్రాప్‌ డౌన్‌ మెనూ ద్వారానే ఆటో రొటేట్‌ను ఎంచుకుంటాం. ఇలా కాకుండా ఈసారి సెటింగ్స్‌లోకి వెళ్లి, డిస్‌ప్లే విభాగం ద్వారా ఆటో రొటేట్‌ స్క్రీన్‌ను ఎంచుకొని చూడండి. ఆటో రొటేట్‌ పనిచేయని స్థితిలో ఈ చిట్కా ఉపయోగపడొచ్చు.

సెన్సర్ల రీకాలిబ్రేషన్‌: ఆటో రొటేట్‌ వంటి ఫీచర్లు సరిగా పనిచేయటానికి గైరోస్కోప్‌, యాక్సిలెరోమీటర్లు ఉపయోగపడతాయి. ఈ మోషన్‌ సెన్సర్లు కాలిబ్రేట్‌ కాకపోతే ఆటో రొటేట్‌ పనిచేయకపోవచ్చు. ఒకవేళ ఫోన్‌లో బిల్టిన్‌గా కాలిబ్రేషన్‌ టూల్‌ లేనట్టయితే ప్లే స్టోర్‌ నుంచి జీపీఎస్‌ స్టేటస్‌ అండ్‌ టూల్‌బాక్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ మోషన్‌ సెన్సర్లను కాలిబ్రేట్‌ చేసుకోవటానికి దీన్ని వాడుకోవచ్చు.

యాప్‌లో రొటేట్‌ సెటింగ్స్‌ చెక్‌: ప్రత్యేకించి ఏదైనా యాప్‌లో ఆటో రొటేట్‌ పనిచేయనట్టయితే దాని సెటింగ్స్‌ను ఓసారి సరి చూసుకోవటం మంచిది. కొన్ని యాప్స్‌ అనవసరంగా స్క్రీన్‌ తిరిగిపోకుండా ఆటో రొటేట్‌ ఫీచర్‌ను ఓవర్‌ రైడ్‌ చేస్తుంటాయి. సెటింగ్స్‌ను మార్చిన తర్వాత యాప్‌ను రీస్టార్ట్‌ చేయాలి.

సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌: కొన్నిసార్లు రాన్రానూ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో కొన్ని అడ్డంగులు, బగ్స్‌ తలెత్తుతుంటాయి. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేస్తే ఇవి తొలగిపోతాయి. ఒకవేళ ఇటీవలి కాలంలో ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేయనట్టయితే ఓసారి అప్‌డేట్‌ చేయటం మంచిది. సెటింగ్స్‌లోకి వెళ్తే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.

యాప్స్‌ అన్‌ఇన్‌స్టాల్‌: ఇటీవల ఏదైనా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశాక సమస్య మొదలైతే దాన్ని డిలీట్‌ చేయటం మంచిది. కొన్ని యాప్స్‌ ఫోన్‌ పనితీరుకు విఘాతం కలిగించొచ్చు. ఆటో రొటేట్‌ వంటి ఫీచర్లు పనిచేయకుండా చేయొచ్చు. కాబట్టి ఇన్‌స్టాల్‌ చేసిన యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసి చూడటం మంచిది.

స్క్రీన్‌ను తాకొద్దు: ఫోన్‌ స్క్రీన్‌ను తాకితే దానంతటదే తిరగకపోవచ్చు. అందువల్ల ఫోన్‌ తెరకు వేళ్లు తాకకుండా చూసుకోవాలి. ఫోన్‌ను ఎక్కడైనా పెట్టినా తెర అంచులకు చుట్టుపక్కల ఉన్నవేవీ తగలనీయొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని