పీసీలోనే మొబైల్‌ గేమ్స్‌

కంప్యూటర్‌ తెర పెద్దగా ఉంటుంది. మౌజ్‌, కీబోర్డు వంటి సదుపాయాలూ ఉంటాయి. అందుకే మొబైల్‌ ఫోన్‌ గేమ్స్‌ను పీసీ మీద ఆడుకోవాలని చాలామంది భావిస్తుంటారు.

Published : 19 Jul 2023 00:28 IST

కంప్యూటర్‌ తెర పెద్దగా ఉంటుంది. మౌజ్‌, కీబోర్డు వంటి సదుపాయాలూ ఉంటాయి. అందుకే మొబైల్‌ ఫోన్‌ గేమ్స్‌ను పీసీ మీద ఆడుకోవాలని చాలామంది భావిస్తుంటారు. గూగుల్‌ ప్లే గేమ్స్‌ ఆన్‌ పీసీ యాప్‌ దీన్ని సుసాధ్యం చేయనుంది. ఇటీవలే ఈ యాప్‌ను మనదేశానికి విస్తరించారు. పేరుకు తగ్గట్టుగానే ఇది మొబైల్‌ గేమ్స్‌ను పీసీ మీద బ్రౌజ్‌ చేయటానికి, డౌన్‌లోడ్‌ చేసుకోవటానికి, ఆడుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఫోన్లు, ట్యాబ్లెట్లు, క్రోమ్‌బుక్స్‌, పీసీ వంటి పరికరాలతో అనుసంధానమై పనిచేస్తుంది. కాబట్టి వేరే పరికరానికి మారినా ఆటను అలాగే కొనసాగించొచ్చు. మనదేశ డెవలపర్లు రూపొందించిన లూడో కింగ్‌, హిట్‌వికెట్‌ గేమ్స్‌ వంటి వాటితో పాటు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ఎవర్‌సోల్‌, లార్డ్స్‌ మొబైల్‌, ఎన్వాయ్‌: ద కింగ్స్‌ రిటర్న్‌ వంటి ఆటలనూ ఇది సపోర్టు చేస్తుంది. మనదేశంలో ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇటీవల కాలంలో దీనికి కొత్త ఫీచర్లనూ జతచేశారు. గూగుల్‌ ప్లే గేమ్స్‌ ఆన్‌ పీసీని వాడుకోవాలంటే సిస్టమ్‌లో తగిన హార్డ్‌వేర్‌ సపోర్టు ఉండాలి.

* ఓఎస్‌: విండోస్‌ 10 (వీ2004).

* స్టోరేజీ: 10జీబీ స్టోరేజీతో కూడిన ఎస్‌ఎస్‌డీ.

* గ్రాఫిక్స్‌: ఇంటెల్‌ యూహెచ్‌డీ గ్రాఫిక్స్‌ 630 జీపీయూ లేదా దీంతో సరిపోలినది.

* ప్రాసెసర్‌: 4 సీపీయూ ఫిజికల్‌ కోర్స్‌ (కొన్ని గేమ్స్‌కు ఇంటెల్‌ సీపీయూ అవసరం).

* మెమరీ: 8జీబీ ర్యామ్‌

* విండోస్‌ అడ్మిన్‌ అకౌంట్‌

* హార్డ్‌వేర్‌ వర్చువలైజేషన్‌ విధిగా ఆన్‌ చేసి ఉండాలి.

గత సంవత్సరలోనే విడుదల చేసినా ఇదిప్పటికీ బీటా టెస్టింగ్‌ రూపంలోనే ఉంది. ఆసక్తి గలవారు దీన్ని వాడుకోవచ్చు. ఇది తేలికే. https://play.google.com/about/googleplaygames/ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, గూగుల్‌ ఖాతాతో సైన్‌ఇన్‌ కావాలి. షరతులను అంగీకరించాలి. అప్పుడు అది సపోర్టు చేసే గేమ్స్‌ జాబితా కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని