ఆ హెడ్‌ఫోన్స్‌ రహస్యమేంటి?

వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌, హెడ్‌ఫోన్స్‌ ఎంతగా ఆకట్టుకుంటున్నాయో చెప్పనక్కర్లేదు. వీడియో చూస్తున్నప్పుడో, సంగీతం వింటున్నప్పుడో చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బంది కలగకుండా మనకు మాత్రమే.

Updated : 29 Nov 2023 09:27 IST

వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌, హెడ్‌ఫోన్స్‌ ఎంతగా ఆకట్టుకుంటున్నాయో చెప్పనక్కర్లేదు. వీడియో చూస్తున్నప్పుడో, సంగీతం వింటున్నప్పుడో చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బంది కలగకుండా మనకు మాత్రమే.. అదీ స్పష్టంగా శబ్దం వినిపించేలా చేస్తాయి. వాహనాల రద్దీ, జన సమూహం, రణగొణ ధ్వనులున్న ప్రాంతాల్లో బాగా ఉపయోగపడతాయి. కాకపోతే హెడ్‌ఫోన్స్‌ పెట్టుకున్నా పరిసరాల చప్పుళ్లు ఎంతోకొంత వినిపిస్తూనే ఉంటాయి. ఆటంకం కలిగిస్తూనే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాక్టివ్‌ నాయిస్‌ కాన్సలేషన్‌ (ఏఎన్‌సీ) రకం హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇవి చుట్టుపక్కల రణగొణ ధ్వనులు వినిపించకుండా అడ్డుకుంటాయి. ఒకప్పుడు వీటిని కొందరే వాడేవారు. ఇప్పుడు దాదాపు అందరికీ ఇష్టమైనవిగా మారాయి. ఇంతకీ ఇవెలా పనిచేస్తాయి?

యాక్టివ్‌ నాయిస్‌ కాన్సలేషన్‌ పరిజ్ఞానం పరిసరాల్లోంచి చెవులకు చేరుకునే ధ్వనుల తీవ్రతను తగ్గిస్తాయి. రణగొణ ధ్వని తరంగాలకు వ్యతిరేక శబ్ద తరంగాలను సృష్టించటం వీటి ప్రత్యేకత. ఒకే ఫ్రీక్వెన్సీ, తీవ్రత గల రెండు తరంగాలు కలిసినప్పుడు అవి ఒకదాన్ని మరోటి రద్దు చేసుకొంటాయి. ఏఎన్‌సీ హెడ్‌ఫోన్స్‌కు ఈ సూత్రమే ఆధారం. చెరువులో రాయి విసిరితే అక్కడి నుంచి అల ఏర్పడి, గుండ్రంగా విస్తరిస్తూ వస్తుంది కదా. ఒకవేళ అదే సమయంలో అక్కడే మరో రాయి విసిరానుకోండి. ఒకదాని వెంట మరో అల పుట్టుకొస్తుంది. రెండూ కలిసి ఇంకాస్త పెద్ద అలను సృష్టిస్తాయి. దీన్నే కన్‌స్ట్రక్టివ్‌ ఇంటర్‌ఫెరెన్స్‌ అంటారు. ఒకవేళ ఒక రాయిని విసిరి, కాసేపటి తర్వాత అక్కడే మరో రాయి విసిరానుకోండి. రెండో అల మొదటి దాని వెనకాల నుంచి విస్తరిస్తూ వస్తుంది. ఈ రెండు అలలూ ఎగిసి, కింద పడటంలోనూ కొంత వ్యత్యాసం ఉంటుంది. ఇవి ఒకదాన్ని మరోటి తగ్గించుకుంటూ వస్తాయి. చివరికి అల చిన్నగానో, లేదంటే పూర్తిగా మాయం కావటమో జరుగుతుంది. దీన్నే డిస్ట్రక్టివ్‌ ఇంటర్‌ఫెరెన్స్‌ అంటారు. యాక్టివ్‌ నాయిస్‌ కాన్సలేషన్‌ పరిజ్ఞానం ఉపయోగించుకునేది ఇదే. దీంతో కూడిన హెడ్‌ఫోన్‌ లేదా ఇయర్‌బడ్‌లో మైక్రోఫోన్‌, ప్రాసెసర్‌, స్పీకర్‌ ఉంటాయి. హెడ్‌ఫోన్‌ బయట ఉండే మైక్రోఫోన్‌ చుట్టుపక్కల చప్పుళ్లను గుర్తిస్తుంది. లోపల ఉండే ప్రాసెసర్‌ వాటిని విశ్లేషించి, యాంటీ-నాయిస్‌ సంకేతాన్ని సృష్టిస్తుంది. ఇదీ చుట్టుపక్కల ధ్వనులతో సమానమైన ఫ్రీక్వెన్సీ, తీవ్రతను కలిగుంటుంది. ఈ యాంటీ నాయిస్‌ సంకేతం, రణగొణ ధ్వని తరంగాలు రెండూ ఢీకొన్నప్పుడు ఒకదాన్ని మరోటి తగ్గించేందుకు ప్రయత్నిస్తాయి. ఇయర్‌ కప్‌ లేదా ఇయర్‌ బడ్‌ లోపలుండే స్పీకర్‌ యాంటీ నాయిస్‌ సంకేతాన్ని ప్లే చేస్తుంది. ఈ ప్రక్రియ అప్పటికప్పుడు, ప్రత్యక్షంగా జరుగుతుంది. నిరంతరం చుట్టుపక్కల ధ్వనులకు అనుగుణంగా మారుతుంది. దీంతో చుట్టుపక్కల ధ్వనులు అంతగా వినిపించవు. అసలు వినిపించకపోవచ్చు కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని