అంతరిక్షంలో సంతానోత్పత్తి!

భూమికి ఆవల మానవ సంతానోత్పత్తి శోధనలో గొప్ప పురోగతి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోని ప్రత్యేక పరిస్థితుల్లోనూ ఎలుకల పిండాల అభివృద్ధి సాధ్యమేనని జపాన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ యమనషి పరిశోధకులు తొలిసారి నిరూపించారు.

Updated : 01 Nov 2023 06:46 IST

భూమికి ఆవల మానవ సంతానోత్పత్తి శోధనలో గొప్ప పురోగతి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోని ప్రత్యేక పరిస్థితుల్లోనూ ఎలుకల పిండాల అభివృద్ధి సాధ్యమేనని జపాన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ యమనషి పరిశోధకులు తొలిసారి నిరూపించారు.

అంతరిక్షంలో మానవ పునరుత్పత్తి అవకాశాలకు కొత్త పరిశోధన దారులు తెరచింది. నిజానికిది 2021, ఆగస్టులోనే మొదలైంది. శాస్త్రవేత్తలు శీతలీకరించిన ఎలుకల పిండాలను రాకెట్‌ ద్వారా ఐఎస్‌ఎస్‌కు పంపించారు. అక్కడ ప్రత్యేక పరికరం సాయంతో ఈ పిండాలను మామూలు స్థితికి తీసుకొచ్చి, సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో వృద్ధి చెందించారు. నాలుగు రోజుల్లో ఇవి బ్లాస్టోసిస్ట్‌ దశకు పెరగటం గమనార్హం. పిండం అభివృద్ధిలో ఈ దశ కీలకం. ఫలదీకరణ చెందిన మూడు రోజుల తర్వాత ఆరోగ్యకరమైన పిండంలో సుమారు 6-10 కణాలుంటాయి. ఐదారు రోజులకు చేరుకునేసరికి అండం అతి వేగంగా విభజన చెందుతూ కణాల ముద్దగా ఏర్పడుతుంది. లోపలి కణాలు పిండంగా ఏర్పడతాయి. వెలుపలి కణాలు పిండానికి పోషకాలు అందిస్తూ, రక్షణగా నిలుస్తాయి. ఇదే బ్లాస్టోసిస్ట్‌ దశ. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణం దీనిపై పెద్దగా ప్రభావం చూపకపోవటం గొప్ప విషయం. వీటిని భూమికి తీసుకొచ్చి.. ప్రయోగశాలలో అదే వాతావరణంలో వృద్ధి చెందిన అలాంటి ఎలుకల పిండాలతోనూ పోల్చి చూశారు. ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. భూమి మీద ప్రయోగశాలలో 60% పిండాలు బ్లాస్టోసిస్ట్‌ దశకు చేరుకోగా.. ఐఎస్‌ఎస్‌లోని సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలోని పిండాల్లో 23.6% వరకు కణ విభజన స్థాయికి చేరుకున్నాయి. భూ వాతావరణంతో పోలిస్తే అంతరిక్ష వాతావరణంలో పిండాల ఎదుగుదల కాస్త తక్కువగా ఉన్నప్పటికీ అక్కడా సంతానోత్పత్తి సాధ్యమేనని దీంతో వెల్లడైంది. డీఎన్‌ఏ, జన్యువుల్లోనూ ఎలాంటి మార్పులు కనిపించకపోవటం విశేషం. భూ గురుత్వాకర్షణ క్షేత్రానికి ఆవల క్షీరదాల మనుగడ సాధ్యమేననే విషయాన్ని ఈ ఎలుకల పిండాల ఎదుగుదల రుజువు చేసింది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో క్షీరదాలు వృద్ధి చెందగలవని దీంతో తొలిసారి నిరూపితమైంది. పిండాల ఎదుగుదలకు, దీన్ని మానవులకు వర్తింపజేయటానికి ఇంకా సాధించాల్సింది చాలానే ఉన్నప్పటికీ కొత్త ఆశలు కల్పించింది. అంతరిక్షంలో వృద్ధి చేసిన పిండాలను ఎలుకల్లో ప్రవేశపెట్టి, అవి ఆరోగ్యకరమైన పిల్లలను కంటాయో లేదో పరిశీలించటం మీద పరిశోధకులు ఇప్పుడు దృష్టి సారించారు. ఇది ఫలిస్తే అంతరిక్షంలో మానవ పునరుత్పత్తి సాధనలో గొప్ప మైలురాయిని అధిగమించినట్టే. మున్ముందు అంతరిక్ష శోధన ముమ్మరం చేయాలని.. చంద్రుడు, అంగారకుడి మీద ఆవాసాలు ఏర్పరచుకోవాలని కలలుగంటున్న మానవాళికిది నిజంగా శుభవార్తే.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని