Twitter: ట్వీట్‌లో తప్పుపోయిందా..? ఇక నాలుక కరచుకోనక్కర్లేదు!

ట్విటర్‌ యూజర్లకు శుభవార్త. మనం చేసిన ట్వీట్‌లో తప్పులను సవరించుకునేందుకు త్వరలో ఎడిట్‌ బటన్‌ తీసుకురాబోతున్నట్లు ట్విటర్‌ ప్రకటించింది.

Updated : 11 May 2022 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌లో మనం చేసిన ట్వీట్‌లో తప్పు పోతే ఏం చేస్తాం. అరె.. తప్పుపోయిందే అని నాలుక కరచుకొని ఆ ట్వీట్‌ డిలీట్‌ చేసి మళ్లీ కొత్తగా ట్వీట్‌ చేస్తాం. ఇకపై ఇలా నాలుక కరచుకోవడాలు.. పని గట్టుకొని అదే ట్వీట్‌ను మళ్లీ మళ్లీ ట్వీటు చేసే అవసరం లేకపోవచ్చు. చాలా రోజుల నుంచి ట్వీట్లను ఎడిట్‌ చేసుకునే సౌలభ్యం ఇవ్వాలంటూ నెటిజన్లు కోరుతున్నప్పటికీ ట్విటర్‌ పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు 2020లో ఎడిట్‌ బటన్‌ ప్రవేశపెట్టబోం అని నిక్కచ్చిగా తేల్చి చెప్పింది కూడా. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకొని త్వరలో ఎడిట్‌  ఆప్షన్‌ తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ తన ఖాతాలో ట్వీట్‌ కూడా చేసింది.

‘‘ట్విటర్‌లో ఎడిట్‌ బటన్‌ కావాలా? అని  నిర్వహించిన పోల్‌  ఆధారంగా ఈ నిర్ణయమేమీ తీసుకోలేదు. గతేడాది నుంచే ఎడిట్‌ ఫీచర్‌ తీసుకురావడానికి మేం ప్రయత్నాలు చేస్తున్నాం. ఎడిట్‌ ఫీచర్‌ సాధ్యాసాధ్యాలను ట్విటర్‌ బ్లూ ల్యాబ్స్‌ ద్వారా పరీక్షిస్తున్నాం’’ అని ట్విటర్‌ పేర్కొంది.

ట్విటర్‌లో కొత్త ఫీచర్‌ ‘ఎడిట్‌ బటన్‌’ ప్రయోగాత్మక దశలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ ఎడిట్‌ ఫీచర్‌తో ట్వీట్‌లో అక్షర దోషాలకు చాలా వరకు చెక్‌ పడే అవకాశం ఉంటుంది.

ట్విటర్‌లో 9.2 శాతం వాటాను ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన తర్వాత ‘‘ట్విటర్‌లో ఎడిట్‌ బటన్‌ ఉండాలని మీరు కోరుకుంటున్నారా?’’ అంటూ ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పోల్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై చాలా మంది యూజర్లు స్పందించి ఎడిట్‌ బటన్‌ ఉండాలనే చెప్పారు. కాగా.. మస్క్‌ ట్వీట్‌కు ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ కూడా స్పందించారు. ‘‘ఈ పోల్‌ పరిణామాలు చాలా ముఖ్యమైనవి. దయచేసి జాగ్రత్తగా ఓటు వేయండి’’ అంటూ యూజర్లను హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని