WhatsApp: మల్టీడివైజ్‌ ఫీచర్‌తో వాట్సాప్ ఐపాడ్ యాప్‌..!

వాట్సాప్ ఐపాడ్ యాప్‌ను తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు వాట్సాప్‌ హెడ్ విల్‌ కాథ్‌కార్ట్ మల్టీడివైజ్‌ ఫీచర్‌తో వాట్సాప్‌ ఐపాడ్ యాప్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు.

Published : 31 Jan 2022 19:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపాడ్ యూజర్లకు వాట్సాప్ శుభవార్త చెప్పింది. త్వరలోనే వాట్సాప్‌ ఐపాడ్ యాప్‌ను తీసుకురానున్నట్లు వాట్సాప్ హెడ్‌ విల్‌ కాథ్‌కార్ట్‌ తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలోనే వాట్సాప్‌ ఐపాడ్ వెర్షన్‌ యాప్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. వాట్సాప్ ఐపాడ్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఎంతో కాలంగా యూజర్లు ఫేస్‌బుక్‌ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ హెడ్ ఐపాడ్ యాప్‌ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఐపాడ్‌ యూజర్లు వాట్సాప్‌ వెబ్‌ వెర్షన్‌ను మాత్రమే యాక్సెస్ చేస్తున్నారు. ‘‘ ఎంతో కాలంగా ఐపాడ్ యాప్‌ను పరిచయం చేయమని యూజర్లు కోరుతున్నారు. త్వరలోనే దీన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం వాట్సాప్ ఐపాడ్‌ యాప్‌కు సంబంధించిన సాంకేతికతను సిద్ధం చేస్తున్నాం. గతేడాది మల్టీడివైజ్‌ ఫీచర్‌ కొత్త సాంకేతికతను పరిచయం చేశాం. దీంతో యూజర్లు ఫోన్‌ యాప్‌కు నెట్‌వర్క్ కనెక్షన్ లేకపోయినా వాట్సాప్ డెస్క్‌టాప్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఇదే తరహా ఫీచర్‌తో ఐపాడ్ యాప్‌ను పరిచయం చేయాలని భావిస్తున్నాం’’ అని విల్ తెలిపారు.

మల్టీడివైజ్‌ ఫీచర్‌తో యూజర్లు ఒకేసారి ఫోన్‌, డెస్క్‌టాప్‌తోపాటు మరో రెండు డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. అయితే వాట్సాప్ ఐపాడ్ యాప్‌ను ఎప్పుడు విడుదల చేయనున్నారనేది మాత్రం విల్ వెల్లడించలేదు. ఇవేకాకుండా వాట్సాప్‌ మరికొన్ని కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనున్నట్లు తెలిపింది. వీటిలో ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కు చాట్ ఇంపోర్ట్, ప్రివ్యూ వాయిస్‌ మెసేజ్‌, ప్రొఫైల్‌ ఫొటో లాక్‌ స్క్రీన్‌ నోటిఫికేషన్‌, ఫొటో ఎడిట్‌, వాయిస్‌ మెసేజ్‌ ప్లే అండ్ చాట్ వంటి ఫీచర్లను పరిచయం చేయనుంది.

చాట్ ఇంపోర్ట్ ఫీచర్‌తో ఆండ్రాయిడ్ 12 ఆపై వెర్షన్‌తో పనిచేస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి ఐఓఎస్ డివైజ్‌లలోకి డేటాను బదిలీ చేసుకోవచ్చు. ప్రివ్యూ వాయిస్‌ మెసేజ్‌తో ఆడియో మెసేజ్‌ పంపే ముందే వినొచ్చు. ఫ్రొఫైల్‌ ఫొటో లాక్‌ స్క్రీన్‌తో మీరు మెసేజ్‌ పంపిన ప్రతిసారీ లాక్‌ స్క్రీన్‌ నోటిఫికేషన్స్‌లో మెసేజ్‌తోపాటు యూజర్‌ ప్రొఫైల్ ఫొటో కూడా కనిపిస్తుంది. వాయిస్‌ మెసేజ్‌ ప్లే అండ్‌ చాట్‌ సాయంతో యూజర్లు ఆడియో మెసేజ్ వింటూనే ఇతరులతో చాట్ చేయొచ్చు. డెస్క్‌టాప్‌లో ఉన్న ఫొటో ఎడిటింగ్‌ టూల్‌ను యాప్‌లో పరిచయం చేస్తున్నారు. ఇవే కాకుండా వాట్సాప్ మొబైల్ యాప్‌ యూజర్ ఇంటర్‌ ఫేస్‌ (యూఐ)లో కూడా మార్పులు చేయనున్నట్లు వాట్సాప్ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని