Updated : 27 Jan 2022 09:44 IST

అదిగదిగో.. ఎగిరే కారు

రెండు నిమిషాల్లోనే ఆకాశంలోకి

బ్రాటిస్లావా: పెరిగిపోతున్న ట్రాఫిక్‌ కష్టాలు, వర్షాలు, రహదారి మరమ్మతుల వంటి సందర్భాల్లో స్తంభిస్తున్న రాకపోకలు.. ఇవన్నీ వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మరి ఈ చిక్కులు లేకుండా రహదారిపై వెళ్తున్న కారుతోనే ఆకాశంలో ఎగిరిపోతే.. మీరు ప్రయాణిస్తున్న కారు 2 నిమిషాల్లో విమానంగా మారిపోతే.. ఇదేదో హాలీవుడ్‌ సినిమాలా ఉంది కదూ.. ఇది త్వరలో సాకారం కానున్న నిజం. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిరే కారు విషయంలో కీలక ముందడుగు పడింది.  గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 8వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం గల ఎగిరే కారుకు ఎయిర్‌ వర్తీనెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తూ స్లొవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 70 గంటల పాటు టెస్టు ఫ్లైట్‌, 200 సార్లకుపైగా ల్యాండింగ్‌, టేకాఫ్‌ల తర్వాత ఈ కారుకు సర్టిఫికెట్‌ జారీ చేశారు. 160 హార్స్‌ పవర్‌ బీఎండబ్ల్యూ ఇంజిన్‌ బిగించిన ఈ ఎగిరే కారు సాధారణ పెట్రోల్‌తోనే నడుస్తుంది. యూరోపియన్‌ ఏవియేషన్‌ సేఫ్టీ ఏజెన్సీ ఈఏఎస్‌ఏ ప్రమాణాలను ఈ కారు అందుకున్నట్లు తయారీదారులు తెలిపారు. ఈ ఎయిర్‌ కారు 8,200 అడుగుల ఎత్తులో 1000 కిలోమీటర్లు ప్రయాణించగలదని వివరించారు. కారు నుంచి విమానంగా రూపాంతరం చెందడానికి ఈ కారుకు 2.15 నిమిషాలు పడుతుంది.

ధర రూ.5.5 కోట్లు!

ఈ ఎగిరే కారు 500 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 28 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని.. కారు ధర రూ. 4.5కోట్ల నుంచి రూ.5.5 కోట్ల వరకు ఉంటుందని దీన్ని తయారు చేసిన క్లెయిన్‌ విజన్‌ సంస్థ తెలిపింది. కారుకు ఇరువైపులా అమర్చిన చిన్న చిన్న రెక్కలు ఎగిరే ముందు విచ్చుకుని పక్షిలా మారిపోతుంది. ఇద్దరు ప్రయాణించే వీలున్న ఈ కారు గరిష్ఠంగా 200 కిలోల బరువు మోయగలదని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అంటోన్‌ జాజాక్‌ తెలిపారు. విమానంలానే టేకాఫ్‌, ల్యాండింగ్‌ చేయడానికి రన్‌వే అవసరం అవుతుందని తయారీదారులు వెల్లడించారు. ఈ ఎగిరే కారుతో త్వరలోనే లండన్‌ నుంచి పారిస్‌కు ప్రయాణించే అవకాశం ఉందని తయారీదారులు తెలిపారు. 2017 నుంచి ఎగిరే కారును క్లెయిన్‌ విజన్‌ కంపెనీ అభివృద్ధి చేస్తుండగా.. దీనికి స్లోవాక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ నుంచి తాజాగా ధ్రువీకరణ లభించింది. తాను రూపొందించిన ఎయిర్‌ కారులో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగిందని.. కారును తయారు చేసిన ప్రొఫెసర్‌ క్లీన్‌ వివరించారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని