Telangana News: పోలీసు శాఖ నుంచే తొలి ప్రకటన!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి తొలి ప్రకటన పోలీసుశాఖ నుంచి వచ్చే అవకాశం ఉంది. జోన్ల వారీగా ఉద్యోగాల ఖాళీల జాబితాతో ఇప్పుటికే సిద్ధంగా ఉన్న అధికారులు ప్రభుత్వం ఆమోదం తెలిపిన

Updated : 14 Mar 2022 08:28 IST

ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో వెలువడే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి తొలి ప్రకటన పోలీసుశాఖ నుంచి వచ్చే అవకాశం ఉంది. జోన్ల వారీగా ఉద్యోగాల ఖాళీల జాబితాతో ఇప్పుటికే సిద్ధంగా ఉన్న అధికారులు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టి.ఎస్‌.ఎల్‌.ఆర్‌.బి.) కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటి వారంలో ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీసుశాఖలో దాదాపు 18వేలకుపైగా ఖాళీలున్నట్లు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఉద్యోగ నియామకానికి సంబంధించి శాసనసభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేయడంతో అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తమయ్యాయి.

ప్రభుత్వ అభిప్రాయం మారడంతో..

ఉద్యోగ ప్రకటన ఇవ్వడానికి మిగతా శాఖలకు కొంత సమయం పడుతుంది. ఉదాహరణకు పోలీసు శాఖతో పాటు అత్యధిక ఖాళీలున్న విద్యాశాఖ నియామక ప్రకటన ఇవ్వాలంటే ముందు టెట్‌ నిర్వహించాలి. పోలీసుశాఖకు అలా కాదు. 2018లో 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసింది. ఇందులో ఎంపికైన వారి శిక్షణ పూర్తికాగానే మరోమారు భారీస్థాయిలో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. హోంమంత్రి కూడా త్వరలోనే పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని బహిరంగంగానే ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే నియామక మండలి సిద్ధమైంది. కొత్త జిల్లాలు, జోన్ల వారీగా ఖాళీల వివరాలను సేకరించి పెట్టింది. గత జులైలోనే నియామకాలకు సంబంధించి ప్రకటన వస్తుందని భావించారు. చివరి నిమిషంలో ప్రభుత్వం అభిప్రాయం మార్చుకోవడంతో ఉద్యోగ ప్రకటన వాయిదా పడింది. అందువల్ల సర్కారు నుంచి అనుమతి వచ్చిన వెంటనే పోలీస్‌శాఖ నోటిఫికేషన్‌ ఇవ్వనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని