నట్టింట్లోకి సూరీడు

పగటిపూట విద్యుత్తుతో పని లేకుండా భవనాల్లోని సెల్లార్లు, చీకటి గదుల్లో సహజ వెలుగులు ప్రసరిస్తే? ఏసీ మాదిరి గొట్టాల ద్వారా సూర్యరశ్మిని గదుల్లోకి తీసుకురాగలిగితే? కరెంటు ఖర్చు ఎంతో ఆదా. ఆరోగ్యమూ బాగుంటుంది. ఇదే ఆలోచనతో

Published : 14 Mar 2022 04:43 IST

 విద్యుద్దీపాల్లేకుండానే సహజకాంతులు

 డేలైట్‌ హార్వెస్టింగ్‌ సాంకేతికతతో సాధ్యం

 పగటివేళ విద్యుత్తు వ్యయం ఎంతో ఆదా

 హైదరాబాద్‌ సంస్థ ఆవిష్కరణకుదేశవ్యాప్త ఆదరణ

గటిపూట విద్యుత్తుతో పని లేకుండా భవనాల్లోని సెల్లార్లు, చీకటి గదుల్లో సహజ వెలుగులు ప్రసరిస్తే? ఏసీ మాదిరి గొట్టాల ద్వారా సూర్యరశ్మిని గదుల్లోకి తీసుకురాగలిగితే? కరెంటు ఖర్చు ఎంతో ఆదా. ఆరోగ్యమూ బాగుంటుంది. ఇదే ఆలోచనతో డే లైట్‌ హార్వెస్టింగ్‌ సాంకేతికతను అభివృద్ధి చేసింది హైదరాబాద్‌లోని స్కైషేడ్‌ డే లైట్స్‌ అంకుర సంస్థ. 2014 నుంచి పరిశోధనలు చేస్తున్న ఈ సంస్థ సెంట్రల్లీ ఇంటిగ్రేటెడ్‌ డేలైట్‌తోపాటు మరో రెండు సాంకేతికతలను అభివృద్ధి చేసి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ) దృష్టిని ఆకర్షించింది. టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ బోర్డు నుంచి తాజాగా రూ.5 కోట్లు అందుకుంది.

నగరంలోని భవనాల్లో పగలూ రాత్రీ తేడా లేకుండా విద్యుద్దీపాలు వెలుగుతుంటాయి. సెల్లార్లలోనూ అదే పరిస్థితి. మొత్తం విద్యుత్తు వినియోగంలో దీపాల వెలుతురు కోసం 35 శాతం వాడుతున్నట్లు డిస్కం లెక్కలు చెబుతున్నాయి. పగటిపూట వాటి వాడకం తగ్గించగలిగితే ఇందులో 80 శాతం విద్యుత్తును ఆదా చేయవచ్చు.


ఎలా పనిచేస్తుంది?

రోజులో సగటున 9 నుంచి 11 గంటలపాటు సహజ సూర్యకాంతి ఉంటుంది. దీన్ని ఇంట్లో చీకటి ఉన్న ప్రాంతాలకు పెద్దగా ఖర్చు లేకుండా చేర్చగలిగితే... గది అంతా వెలుతురే. డేలైట్‌ హార్వెస్టింగ్‌ సాంకేతికతతో సూర్యకాంతిని మొదట సన్‌లైట్‌ కలెక్టర్స్‌ ద్వారా ఒకచోట చేరుస్తారు. దీన్ని చీకటి ఉండే సెల్లార్లలోకి పైపు ద్వారా పంపిస్తారు. 2 చదరపు అడుగుల వ్యాసార్ధంలో ఉండే సన్‌లైట్‌ కలెక్టర్‌ నుంచి వచ్చే వెలుగు 1500-2000 చ.అ. విస్తీర్ణం వరకు సరిపోతుంది. ఇది 250 వోల్టుల ఎల్‌ఈడీ బల్బు ఇచ్చేంత వెలుతురును ప్రసరిస్తుంది. విస్తీర్ణాన్ని బట్టి వీటిని బిగించుకోవచ్చు. పాత, కొత్త భవనాలకూ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.


సెంట్రల్లీ అయితే...

సెంట్రల్లీ ఇంటిగ్రేటెడ్‌ డేలైట్‌ అయితే గదుల్లోని ఫాల్స్‌ సీలింగ్‌ నుంచి పైపు తీసుకొచ్చి మధ్యమధ్యలో డేలైట్‌ను అమర్చుతారు. అవి విద్యుత్తు లేకుండానే ఎల్‌ఈడీ బల్బుల్లా వెలుగునిస్తాయి. మాల్స్‌, కార్యాలయాలు, గోదాముల్లో వీటిని బిగించుకుంటున్నారు. యాదాద్రి ఆలయ మండపంలో భక్తులు రాకపోకలు సాగించే మార్గాల్లో వీటిని అమర్చారు. చెన్నై విమానాశ్రయం కొత్త టెర్మినల్‌లో ఏకంగా 60 వేల చ.మీటర్ల విస్తీర్ణంలో ఈ తరహా వెలుతురును ఏర్పాటు చేశారు. తెలంగాణ సచివాలయం, పీఎంవో కార్యాలయం, ఎన్‌టీపీసీ, అమెజాన్‌, ఐకియా, మహీంద్రా, టాటా, డీమార్ట్‌లతో పాటు కొన్ని ఆలయాలు, మసీదుల్లోనూ వీటిని అమర్చారు.


3 కోట్ల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు చేశాం

మాది విజయవాడ. కాకినాడ జేఎన్‌టీయూలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థలో చేరాను. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ఉద్యోగం వదిలేసి, 1995 ప్రాంతంలో సోలార్‌ థర్మల్‌ వ్యాపారంలో ప్రవేశించాను. ఇళ్లు, హోటళ్లలో వేడినీటి కోసం సౌరవిద్యుత్తు ఏర్పాటు చేసేవాళ్లం. వ్యయం ఎక్కువ కావడంతో ఆ రోజుల్లో వీటిని విక్రయించడం కష్టంగా ఉండేది. అప్పుడే సూర్యకాంతిని సద్వినియోగం చేసుకోవడంపై నా దృష్టి పడింది. ఈ సాంకేతికతను రెండు మూడేళ్లు శ్రమించి సొంతంగా అభివృద్ధి చేశాం. ఇప్పటివరకు 3 కోట్ల చ.అ.విస్తీర్ణంలో వీటిని ఏర్పాటు చేశాం. అయోధ్య ఆలయంలోనూ డేలైట్‌ సాధనాలు అమర్చే విషయమై చర్చలు జరుగుతున్నాయి.

- శేఖర్‌ నూరి, ఎండీ, స్కైషేడ్‌ డేలైట్‌

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని