రాములోరి సన్నిధికి.. రైలు!

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం రైలు మార్గంతో అనుసంధానం కానుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి రాష్ట్రంలో పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైనుకు సంబంధించిన చివరి విడత సర్వే జరుగుతోంది.

Published : 23 Apr 2022 04:57 IST

 మల్కన్‌గిరి-భద్రాచలం మధ్య కొత్త మార్గం

 గోదావరిపై భారీ వంతెన

రూ.2,800 కోట్ల అంచనా వ్యయం

రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం రైలు మార్గంతో అనుసంధానం కానుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి రాష్ట్రంలో పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైనుకు సంబంధించిన చివరి విడత సర్వే జరుగుతోంది. జూన్‌ కల్లా ఈ నివేదిక సిద్ధం కానుంది. ప్రాథమికంగా రూ.2,800 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. అనంతరం డీపీఆర్‌ రూపొందించాక నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించిన తుది సర్వేపై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ శుక్రవారం ఒడిశాలోని కోరాపూట్‌లో జిల్లా అధికారులు, వాల్తేర్‌ డివిజన్‌ డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ మార్గానికున్న ప్రాధాన్యం, అనుసంధాన ప్రాంతాలు తదితరాలను డీఆర్‌ఎం మంత్రికి వివరించారు. భద్రాచలం వద్ద గోదావరిపై భారీ వంతెన నిర్మించాల్సి ఉంటుందన్నారు.

అటు ఆధ్యాత్మిక పర్యాటకం..ఇటు సరకు రవాణా

భద్రాచలానికి వెళ్లే భక్తులు భద్రాచలం రోడ్‌(కొత్తగూడెం) స్టేషన్‌లో దిగి, రోడ్డు మార్గంలో 40 కి.మీ ప్రయాణించాల్సి వస్తోంది. ఏటా 30 లక్షలకు మందికిపైగా పర్యాటకులు రాములవారి ఆలయాన్ని దర్శిస్తున్నారు. భద్రాచలం ఆలయాన్ని ‘ప్రసాద్‌’ పథకంలో చేర్చేందుకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఈ మేరకు రూ.92.04 కోట్లతో రాష్ట్ర పర్యాటకశాఖ ప్రతిపాదనలూ పంపింది. ‘ఈ రైలుమార్గం ఒడిశా, తెలంగాణలోని గిరిజన ప్రాంతాల మీదుగా సాగుతుంది. అందుకే రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మరోవైపు భద్రాచలం రోడ్‌-సత్తుపల్లి కొత్త రైల్వే లైను నిర్మాణం తుది దశలో ఉంది. సత్తుపల్లి నుంచి ఏపీలోని కొవ్వూరు వరకు కొత్త లైను చాలాకాలం క్రితమే మంజూరైనా పట్టాలెక్కలేదు. మల్కన్‌గిరి-భద్రాచలం మార్గం పూర్తయితే కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల నుంచి బొగ్గు ఇతర ఖనిజాల్ని ఏపీలోని కాకినాడ పోర్టుకు రవాణా చేయడం సులభం అవుతుంది. రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంద’’న్నాయి రైల్వే వర్గాలు.

మల్కన్‌గిరి-భద్రాచలం కొత్త లైను

*  రైల్వే స్టేషన్ల సంఖ్య: 12

* మార్గం పొడవు: 173.41 కిమీ

* అంచనా వ్యయం: దాదాపు రూ.2,800 కోట్లు

* పెద్ద, ముఖ్యమైన వంతెనలు: 213 (48 పెద్దవి, 165 చిన్నవి)

ఒడిశాలో స్టేషన్లు: మల్కన్‌గిరి, బడాలి, కొవాసిగూడ, రజన్‌గూడ, మహారాజ్‌పల్లి, లునిమన్‌గూడ

తెలంగాణలో స్టేషన్లు: కన్నాపురం, కుటుగుట్ట, నందిగామ, భద్రాచలం, పాండురంగాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు