రాష్ట్రానికి హ్యుందాయ్‌

మరో మూడు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొచ్చాయి. హ్యుందాయ్‌ రూ.1400 కోట్లతో, జీఎంఎం ఫాడ్యులర్‌ రూ.50 కోట్లతో, ఈఎంపీఈ రూ.50 కోట్లతో పరిశ్రమల ఏర్పాటు కోసం,

Updated : 27 May 2022 05:45 IST

రూ.1400 కోట్లతో భారీ పరిశ్రమ స్థాపనకు ఒప్పందం
మొబిలిటీ క్లస్టర్‌ వ్యాలీలో పెట్టుబడులు
విస్తరణకు ముందుకొచ్చిన మరో రెండు పరిశ్రమలు
మాస్టర్‌కార్డ్‌తో డిజిటల్‌ సేవలకు అంగీకారం

ఈనాడు, హైదరాబాద్‌: మరో మూడు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొచ్చాయి. హ్యుందాయ్‌ రూ.1400 కోట్లతో, జీఎంఎం ఫాడ్యులర్‌ రూ.50 కోట్లతో, ఈఎంపీఈ రూ.50 కోట్లతో పరిశ్రమల ఏర్పాటు కోసం, విఖ్యాత ఆర్థిక సేవల సంస్థ మాస్టర్‌కార్డ్‌ రాష్ట్రంలో ప్రపంచస్థాయి ఆర్థిక సేవల కోసం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గతిశక్తి సమూహం (మొబిలిటీ క్లస్టర్‌) వ్యాలీలో రూ.1400 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమను స్థాపించాలని ప్రసిద్ధ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ నిర్ణయించింది. దీనిద్వారా రెండువేల మందికి ఉపాధి కల్పించనుంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా దావోస్‌లో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌లో హ్యుందాయ్‌ సీఐవో యంగ్‌చోచి తమ ప్రతినిధి బృందంతో రాష్ట్ర మంత్రి కేటీ రామారావును కలిశారు. ఈ సందర్భంగా యంగ్‌చోచి మాట్లాడుతూ.. ‘‘వినూత్న రీతిలో తెలంగాణ మొబిలిటీ క్లస్టర్‌ వ్యాలీ ఏర్పాటు గొప్ప నిర్ణయం. దీనిలో మేమూ భాగస్వాములుగా చేరతాం. మా సంస్థ పరంగా టెస్ట్‌ట్రాక్‌లతో పాటు ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు. హ్యుందాయ్‌ నిర్ణయంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. గతిశక్తి రంగానికి ఈ భారీ పెట్టుబడి గొప్పబలాన్ని, వాహనరంగానికి ఊతమిస్తుంది. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మొబిలిటీ వ్యాలీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. హ్యుందాయ్‌ రాకతో ఈ రంగంలో తెలంగాణ రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయి.

మరో రూ.50 కోట్ల పెట్టుబడితో జీఎంఎం ఫాడ్యులర్‌ విస్తరణ

రసాయన, ఔషధ, ఆహార, విద్యుత్‌ రంగ సంస్థలకు గ్లాస్‌లైనింగ్‌ పరికరాలు, రియాక్టర్‌, ట్యాంక్‌, కాలమ్‌లను తయారు చేసే అంతర్జాతీయ సంస్థ జీఎంఎం ఫాడ్యులర్‌ హైదరాబాద్‌లో రూ. 50 కోట్లతో తమ పరిశ్రమను విస్తరించనుంది.ఈ విస్తరణతో మరో 300 మందికి ఉపాధి లభిస్తుంది. ఆ సంస్థ రెండేళ్ల క్రితం రూ.100 కోట్లతో హైదరాబాద్‌లో పరిశ్రమను స్థాపించింది. సంస్థ వాణిజ్య విభాగం సీఈవో థామస్‌ కెహ్ల్‌, ప్రపంచ ఆర్థిక వేదిక డైరెక్టర్‌ అశోక్‌ పటేల్‌లు గురువారం మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ‘‘తెలంగాణలో ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యత కారణంగా ఇక్కడ పరిశ్రమల స్థాపన అత్యంత సానుకూలాంశంగా ఉంది. మా వ్యాపార విస్తరణలో ఈ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్‌ ఔషధనగిరి ప్రాజెక్టులో భాగస్వామిగా చేరతాం’’ అని తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రాన్ని విస్తరించాలనుకున్న జీఎంఎం నిర్ణయం తనకు సంతోషాన్ని కలిగించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఫార్మా పరికరాల తయారీ రంగంలో నెంబర్‌వన్‌గా ఎదగాలనుకుంటున్న ఆ సంస్థ లక్ష్యాన్ని చేరడంలో హైదరాబాద్‌ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందన్న నమ్మకం తమకుందని అన్నారు.

టీబీ నిర్ధారణ కిట్ల కేంద్రాన్ని విస్తరించనున్న ఈఎంపీఈ....

స్వీడన్‌కుచెందిన ఈఎంపీఈ సంస్థ రూ. 50 కోట్ల పెట్టుబడితో క్షయవ్యాధి నిర్ధారణ కిట్ల తయారీ కేంద్రాన్ని విస్తరించనుంది. ఈ సంస్థ ఇటీవలే రూ.25 కోట్ల పెట్టుబడితో జీనోమ్‌ వ్యాలీలో కేంద్రం ఏర్పాటుచేసింది. సంస్థ సీఈవో పవన్‌ అసలాపురం తమ ప్రతినిధులతో కేటీఆర్‌తో దావోస్‌లో భేటీ అయ్యారు. తాము 5 దేశాల్లో క్లినికల్‌ పరీక్షలు నిర్వహించిన తరువాత హైదరాబాద్‌ను ఎంచుకున్నట్టు తెలిపారు. అదనంగా రూ.50 కోట్ల పెట్టుబడితో 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. కేటీఆర్‌ వారిని అభినందించారు.


వినూత్న ఆవిష్కరణలతోనే దేశపురోగతి
దావోస్‌లో చర్చాగోష్ఠిలో మంత్రి కేటీఆర్‌

వినూత్న ఆవిష్కరణలతోనే దేశం పురోగమిస్తుందని, వాటిని పెద్దఎత్తున ప్రోత్సహించాలని, తెలంగాణ మాదిరిగా ఇంటింటా ఆవిష్కరణల సంస్కృతి విస్తరించాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. గురువారం దావోస్‌లో అంకుర వ్యవస్థాపకులతో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి సాధించడానికి ఆవిష్కరణలు దోహదపడతాయి. ఎదుర్కొంటున్న సవాళ్లను దాటుకొని దేశం వేగంగా ముందుకు పోవాలంటే  ఆవిష్కరణలు, మథనం, అమలు మంత్రమే మార్గం. అంకురాలలో 95% విఫలం అయ్యే అవకాశం ఉన్నా, నూతన ఆలోచనలకు ప్రోత్సాహమివ్వాలి. సహకారం అందించాలి. తెలంగాణ ఆవిష్కరణల విభాగం ద్వారా పాఠశాల స్థాయిలో అవగాహన కల్పిస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వాలు మారినా కనీసం ఒకటి రెండు దశాబ్దాల పాటు ఆవిష్కరణల విధానం స్థిరంగా ఉండాలి’’ అని కేటీఆర్‌ అన్నారు.


తెలంగాణకు మాస్టర్‌కార్డ్‌

మెరికా అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మాస్టర్‌కార్డ్‌ తెలంగాణతో జత కట్టింది. డిజిటల్‌ భాగస్వామ్యంపై మంత్రి కేటీఆర్‌ సమక్షంలో దావోస్‌లో జరిగిన ఒప్పందంపై సంస్థ వైస్‌ఛైర్మన్‌, వృద్ధి విభాగం అధ్యక్షుడు మైఖేల్‌ ఫ్రోమ్యాన్‌, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌లు సంతకాలు చేశారు.ఈ ఒప్పందం మైలురాయి అని, దీని ద్వారా ప్రపంచ స్థాయిలో పరిష్కారాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘మాస్టర్‌కార్డ్‌తో రాష్ట్రంలోని ప్రజలకు అత్యంత వేగంగా పౌరసేవలు, సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్లను అందించడం,  రైతులు, చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఆర్థిక సేవలు, సైబర్‌ క్రైమ్‌, డిజిటల్‌ అక్షరాస్యత వంటి కీలక రంగాల్లో  కలిసి పనిచేస్తాం’’ అని మంత్రి తెలిపారు. ఫ్రోమ్యాన్‌ మాట్లాడుతూ, ‘‘డిజిటల్‌, ఆర్థిక సేవలను విస్తరించడానికి మాస్టర్‌ కార్డ్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది. తెలంగాణ ప్రజలకు డిజిటల్‌ సేవలను సత్వరమే అందించేందుకు మాస్టర్‌కార్డు సిద్ధంగా ఉంది.’’ అని తెలిపారు. ఈ సమావేశాల్లో జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్‌  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని