Huzurabad By Election: ఉదయం 9.30కే తొలి రౌండ్‌ ఫలితం

రాష్ట్ర స్థాయిలో ఉత్కంఠను రేపుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం వెల్లడికి సమయం ఆసన్నమైంది. హోరాహోరీగా నెలలపాటు సాగిన ప్రచార పర్వం తర్వాత జరిగిన ఈ ఎన్నికలో హుజూరా‘బాద్‌షా’గా ఎవరు నిలుస్తారో మరికొన్ని

Updated : 02 Nov 2021 05:28 IST

 హుజూరా‘బాద్‌షా’ ఎవరో..?

నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

కరీంనగర్‌లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: రాష్ట్ర స్థాయిలో ఉత్కంఠను రేపుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం వెల్లడికి సమయం ఆసన్నమైంది. హోరాహోరీగా నెలలపాటు సాగిన ప్రచార పర్వం తర్వాత జరిగిన ఈ ఎన్నికలో హుజూరా‘బాద్‌షా’గా ఎవరు నిలుస్తారో మరికొన్ని గంటల్లో తేలనుంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలుత ఉదయం 8 గంటలకు 753 పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కపెట్టడం ప్రారంభిస్తారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం రెండు కేంద్రాలను లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో 7 టేబుళ్ల చొప్పున ఏకకాలంలో రెండు చోట్ల 14 టేబుళ్లపై ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. ఇలా ఒక్కో రౌండ్‌లో 14 టేబుళ్లపై రెండు ఈవీఎంలలో ఆయా అభ్యర్థులకు పడిన ఓట్లను ఏజెంట్ల సమక్షంలో లెక్కిస్తారు. మొత్తంగా 22 రౌండ్ల లెక్కింపు జరగనుంది. తొలిరౌండు ఫలితాలు ఉదయం 9:30 గంటలకు వచ్చే అవకాశం ఉంది. 30 మంది అభ్యర్థులు ఉండటంతో తుది ఫలితం వచ్చే సరికి సాయంత్రం అవనుంది.

సవాలుగానే గెలుపు..

ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపును సవాల్‌గా తీసుకున్నారు. అధికార తెరాస ఇక్కడ తమ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపు ఖాయమనే ధీమాతో ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయానికి అండగా నిలుస్తాయని భావిస్తోంది. మరోవైపు ఆత్మగౌరవ నినాదంతో తెరాస నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భాజపా తరఫున రంగంలోకి దిగారు. తనను ప్రజలు తప్పక ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నారు. కాంగ్రెస్‌.. యువ నేత బల్మూరి వెంకట్‌ను రంగంలోకి దింపి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మొత్తంమీద ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో బహిర్గతం కానుంది.


 

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లెక్కింపు కేంద్రమైన కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. కళాశాల మొదటి గేట్‌ వద్ద ఇలా తాత్కాలిక బుల్లెట్‌ ప్రూఫ్‌ సెంట్రీ పోస్టును ఏర్పాటు చేశారు.

- ఈటీవీ, కరీంనగర్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని