Huzurabad By Election: హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌(32)ను రంగంలోకి దింపుతోంది. వెంకట్‌ పూర్తిపేరు బల్మూరి వెంకట నర్సింగరావు.....

Updated : 03 Oct 2021 09:47 IST

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌ - గాంధీభవన్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌(32)ను రంగంలోకి దింపుతోంది. వెంకట్‌ పూర్తిపేరు బల్మూరి వెంకట నర్సింగరావు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల ఈయన స్వగ్రామం. ఎంబీబీఎస్‌ చదివారు. మాజీ మంత్రి పురుషోత్తమరావుకు దగ్గరి బంధువు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. శనివారం నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ ఆందోళనలో పాల్గొన్న వెంకట్‌ పోలీసులతో జరిగిన తోపులాటలో గాయపడి ఆసుపత్రిలో చేరారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క వెంకట్‌ పేరును ప్రతిపాదించగా.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు బలపరిచినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా వెంకట్‌ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. 4 లేదా 5న ఆయన నామినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించినందుకు అధిష్ఠానానికి వెంకట్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా.. కష్టపడే తత్వాన్ని గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడం కాంగ్రెస్‌లోనే సాధ్యమన్నారు. హుజూరాబాద్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పలువురి పేర్ల పరిశీలన
గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డి 60 వేలకుపైగా ఓట్లను సాధించారు. తర్వాత అనూహ్య పరిణామాల నడుమ ఆయన కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొండా సురేఖ సహా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, మరో ఇద్దరు, ముగ్గురి పేర్లను పార్టీ పరిశీలించింది. ఒక దశలో సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆమె విధించిన షరతులతో ఏకీభవించని అధిష్ఠానం వెంకట్‌ వైపు దృష్టి సారించినట్లు తెలిసింది. తెరాస తమ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా.. కాంగ్రెస్‌ కూడా అదే వైఖరితో విద్యార్థి నేతను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని