KTR: డిసెంబరుకల్లా  100% వ్యాక్సినేషన్‌

రాష్ట్రంలో ఈ ఏడాది చివరికల్లా వంద శాతం కరోనా టీకాల పంపిణీ (వ్యాక్సినేషన్‌) పూర్తిచేస్తామని మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం కోటి వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలిక పరిధి

Updated : 29 May 2021 10:04 IST

మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: రాష్ట్రంలో ఈ ఏడాది చివరికల్లా వంద శాతం కరోనా టీకాల పంపిణీ (వ్యాక్సినేషన్‌) పూర్తిచేస్తామని మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం కోటి వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలిక పరిధి తిప్పాపూర్‌లో కొత్తగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రపంచానికి అవసరమైన రెండు రకాల టీకాలు రాష్ట్రంలో తయారవుతున్నా.. వాటి ఉత్పత్తిలో 85 శాతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. కొనుగోలు చేద్దామన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటుకు ధరల్లో వ్యత్యాసం ఉందన్నారు. మిగిలిన 15 శాతం ఉత్పత్తినీ వ్యాక్సిన్‌ కంపెనీలు ప్రైవేటు సంస్థలకు అమ్ముకునేందుకు ఇష్టపడుతున్నాయని తెలిపారు. వ్యాక్సిన్‌ల కొనుగోలులో రాష్ట్రాల పాత్ర లేకుండా చేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గుతోందని, ఒకవేళ పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇతర దేశాల్లో వైద్యవిద్య పూర్తిచేసి వచ్చినవారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని