Remdesivir: రెమ్‌డెసివిర్‌ను ఆసుపత్రులే ఇవ్వాలి

కరోనా రోగులకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఆసుపత్రులే ఇవ్వాలని, బయట రిటైల్‌ మార్కెట్‌ నుంచి తెచ్చుకోమని రోగులు, వారి సహాయకులకు చెప్పకూడదని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంగళవారం జారీ చేసిన మార్గనిర్దేశాలలో పేర్కొంది. రోగికి వైద్యసేవలు అందించడంలో

Updated : 08 Jun 2021 08:05 IST

బయటినుంచి తెచ్చుకోమని రోగులకు చెప్పొద్దు
కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తాజా మార్గనిర్దేశాలు

ఈనాడు, దిల్లీ: కరోనా రోగులకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఆసుపత్రులే ఇవ్వాలని, బయట రిటైల్‌ మార్కెట్‌ నుంచి తెచ్చుకోమని రోగులు, వారి సహాయకులకు చెప్పకూడదని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంగళవారం జారీ చేసిన మార్గనిర్దేశాలలో పేర్కొంది. రోగికి వైద్యసేవలు అందించడంలో నిమగ్నమైన సీనియర్‌ ఫ్యాకల్టీ మెంబర్‌/స్పెషలిస్ట్‌ డాక్టర్‌ మాత్రమే రెమ్‌డెసివిర్‌ను ప్రతిపాదించాలని పేర్కొంది. వేళ కాని వేళల్లో దీన్ని రోగికి అందించాలని సూచించినప్పుడు డ్యూటీలో ఉన్న డాక్టర్‌.. సీనియర్‌ డాక్టర్‌తో టెలిఫోన్‌లో సంప్రదించిన తర్వాతే ఇవ్వాలని నిర్దేశించింది. ఈ మందును ప్రతిపాదించిన డాక్టర్‌ సదరు ప్రిస్క్రిప్షన్‌ మీద పేరు, సంతకం, స్టాంప్‌ తప్పనిసరిగా వేయాలని చెప్పింది. ఆసుపత్రిలో రెమ్‌డెసివిర్‌ వినియోగం గురించి ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ప్రతి ఆసుపత్రి తప్పనిసరిగా స్పెషల్‌ డ్రగ్‌ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంచేసింది. ఇందులో వీలైనచోట ఫార్మకాలజీ ప్రొఫెసర్‌ను ఒక సభ్యుడిగా నియమించాలని పేర్కొంది. ఈ కమిటీ తమ అధ్యయనంలో తేలిన అంశాలను వైద్యసేవలు అందించే డాక్టర్లతో పంచుకొని రెమ్‌డెసివిర్‌ను హేతుబద్ధంగా ఉపయోగించేలా సూచనలు జారీ చేయాలని సూచించింది.
* రెమ్‌డెసివిర్‌ను కేవలం మధ్యస్థాయి, తీవ్రమైన లక్షణాలతో ఆక్సిజన్‌ సపోర్టుపై ఉన్న రోగుల్లో ఎంపికచేసిన వారికి మాత్రమే ఇవ్వాలి. ఇది అత్యవసర వినియోగం కోసం అనుమతిచ్చిన ఒక రిజర్వ్‌ డ్రగ్‌ మాత్రమే.
* ఇంట్లో ఏకాంతవాసంలో, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్న తేలికపాటి లక్షణాలున్న వారికి దీన్ని ప్రతిపాదించకూడదు.
* డాక్టర్లు రెమ్‌డెసివిర్‌ దుర్వినియోగాన్ని ఆపాలి. అధిక ధర, తక్కువ లభ్యత ఉన్న ఈ మందును ఇష్టానుసారం ప్రతిపాదించకూడదు. దానివల్ల నష్టాలు ఉంటాయి.
* ఇది మరణాలను ఆపకపోయినా 94% లోపు ఆక్సిజన్‌స్థాయి ఉన్న రోగులకు 7-10 రోజుల మధ్యలో దీన్ని ఇచ్చినప్పుడు త్వరగా కోలుకుంటారని అధ్యయనాల్లో తేలింది. సాధారణ రోగులు 15 రోజుల్లో కోలుకుంటే, ఇది ఇచ్చిన వారు 10 రోజుల్లోనే కోలుకుంటున్నట్లు అధ్యయనాలున్నాయి. ఆసుపత్రిలో ఉండాల్సిన సమయం 17 నుంచి 12 రోగులకు తగ్గినట్లు వెల్లడైంది. కానీ మరణాలను అరికట్టడంలో మాత్రం ప్రభావం చూపలేదని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.

తేలికపాటి లక్షణాలుంటే.. హైడ్రాక్సీ, ఐవర్‌మెక్టిన్‌ వాడొద్దు

లక్షణాలు లేని, తేలికపాటి లక్షణాలున్న కొవిడ్‌ రోగులు హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ఐవర్‌మెక్టిన్‌, డాక్సీసైక్లిన్‌, జింక్‌, మల్టీవిటమిన్‌ మాత్రలు వాడకూడదని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ పేర్కొంది. కొవిడ్‌ రోగులకు చికిత్స అందించేందుకు తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ మందులన్నింటినీ తొలగించింది. డాక్టర్లు సీటీ స్కాన్‌ లాంటి అనవసరమైన టెస్టులను ప్రతిపాదించొద్దని పేర్కొంది. లక్షణాలు తీవ్రమవుతున్నప్పుడు మాత్రమే హెచ్‌ఆర్‌సీటీ టెస్ట్‌ ప్రతిపాదించాలని పేర్కొంది. సీఎక్స్‌ఆర్‌ వరుసగా చేయకూడదని, రెండింటి మధ్య కనీసం 48 గంటల తేడా ఉండాలని తెలిపింది. సీఆర్‌పీ, డీడైమర్‌ 48 నుంచి 72 గంటలకోసారి, సీబీసీ, కేఎఫ్‌టీ, ఎల్‌ఎఫ్‌టీ పరీక్షలు 24 నుంచి 48 గంటలకోసారి చేయాలని సూచించింది. రోగులు జ్వరం, ఆయాసం, ఆక్సిజన్‌ స్థాయిల గురించి, రోగ లక్షణాలు ఏమైనా తీవ్రమవుతున్నాయా? అన్నది గమనిస్తూ ఉండాలని పేర్కొంది. ఉపశమనం కోసం యాంటీపైరెటిక్‌, యాంటీ టస్సివ్‌ తీసుకోవచ్చని తెలిపింది. దగ్గు ఉంటే బుడెసొనైడ్‌ (800 మాక్రోగ్రామ్స్‌) ఇన్‌హలేషన్‌ను రోజుకు రెండుసార్లు చొప్పున 5 రోజులపాటు కొనసాగించవచ్చని సూచించింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని