Telangana High Court: యూనివర్సిటీలు మూసి పాఠశాలలు తెరుస్తున్నారా?

కొవిడ్‌ నేపథ్యంలో యూనివర్సిటీలు, వసతి గృహాలను ఓవైపు మూసివేస్తూ మరోవైపు పాఠశాలలను ఎలా తెరుస్తారని ప్రభుత్వాన్ని శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది. స్కూళ్ల ప్రారంభంపై నిర్ణయమేమిటో చెప్పాలని ఆదేశించింది.

Updated : 29 Jan 2022 04:42 IST

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సర్కారు న్యాయవాది

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ నేపథ్యంలో యూనివర్సిటీలు, వసతి గృహాలను ఓవైపు మూసివేస్తూ మరోవైపు పాఠశాలలను ఎలా తెరుస్తారని ప్రభుత్వాన్ని శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది. స్కూళ్ల ప్రారంభంపై నిర్ణయమేమిటో చెప్పాలని ఆదేశించింది. కొవిడ్‌ నేపథ్యంలో సమ్మక్క సారక్క జాతర నిర్వహణలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంది. పిల్లలకు చికిత్స అందించడానికి చేసిన ఏర్పాట్లు, మందుల కిట్ల వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావును ఆదేశించింది. కొవిడ్‌పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున పలువురు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఓవైపు యూనివర్సిటీలు, హాస్టళ్లను ప్రభుత్వం మూసివేస్తోందని, మరోవైపు పాఠశాలలను తెరవాలని నిర్ణయించిందన్నారు. పిల్లలకు సరైన వైద్యసదుపాయాలు లేవన్నారు. ఫీవర్‌ సర్వే నిర్వహించి పిల్లలు, పెద్దలకు ఒకే విధమైన మందుల కిట్లు ఇచ్చారన్నారు. వారంతపు సంతల్లో భౌతిక దూరం పాటించడంలేదని.. దీనివల్ల కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువవుతోందనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ ఎంతో కొంత ఆర్జించుకుంటున్న రైతులను బయటకు పంపేద్దామా అని ప్రశ్నించింది. విచారణకు ఆన్‌లైన్‌లో హాజరైన ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు స్పందిస్తూ కొవిడ్‌ నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. పిల్లలకు వేరుగా మందులు, సిరప్‌లు అందజేశామన్నారు. వారి కోసం 6 వేల బెడ్‌లు, 1,875 ఐసీయూ పడకలున్నాయని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్ల సందేహాలను నివృత్తి చేసేలా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సర్కారు తరఫున న్యాయవాది అనడంతో పూర్తివివరాలు వచ్చే విచారణలో చెప్పాలని ఆదేశిస్తూ ధర్మాసనం 3వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని