దేశంలో తొలి ‘ఎక్స్‌ఈ’ కొవిడ్‌ కేసు!

దేశంలో కొవిడ్‌ కొత్త ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ తొలి కేసు ముంబయిలో బయటపడినట్లు నగరపాలక సంస్థ (బీఎంసీ) అధికారులు బుధవారం తెలిపారు. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళ (50)కు ఈ

Published : 07 Apr 2022 04:26 IST

ముంబయి/దిల్లీ: దేశంలో కొవిడ్‌ కొత్త ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ తొలి కేసు ముంబయిలో బయటపడినట్లు నగరపాలక సంస్థ (బీఎంసీ) అధికారులు బుధవారం తెలిపారు. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళ (50)కు ఈ వేరియంట్‌ సోకినట్లు వెల్లడించారు. అయితే తదుపరి విశ్లేషణకు గాను ఆమెకు సంబంధించిన డేటాను జాతీయ బయోమెడికల్‌ జీనోమిక్స్‌ సంస్థ (ఎన్‌ఐబీజీఎం)కి పంపుతున్నట్లు అనంతరం మరో అధికారి తెలిపారు. అలాగే ముంబయిలో బయటపడిన రకం ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ అని ఇప్పుడే చెప్పలేమని ఇన్సాకాగ్‌ను ఉంటంకిస్తూ దిల్లీలో సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌లో కొత్త ఉత్పరివర్తన రకాన్ని ‘ఎక్స్‌ఈ’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని తొలిసారి బ్రిటన్‌లో గుర్తించారు. ఒమిక్రాన్‌ ఉప రకాలైన ‘బీఏ.1, బీఏ.2’ల మిశ్రమ ఉత్పరివర్తన (రీకాంబినంట్‌) రకాన్నే ‘ఎక్స్‌ఈ’గా డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. దీనికి బీఏ.2 కంటే 10% ఎక్కువ సాంక్రమికశక్తి ఉన్నట్లు కనిపిస్తోందని కూడా తెలిపింది. కాగా ముంబయిలో ‘ఎక్స్‌ఈ’ బారినపడినట్లు భావిస్తున్న మహిళలో ఎలాంటి లక్షణాలు లేవని, ఆమె కోలుకున్నారని బీఎంసీ అధికారులు తెలిపారు. తాము 376 శాంపిళ్లను జన్యుక్రమ విశ్లేషణకు పంపించగా వాటిలో ఒక ‘ఎక్స్‌ఈ’ కేసుతో పాటు, ఓ ‘కప్పా’ వేరియంట్‌ కేసు కూడా నమోదైనట్లు చెప్పారు. ముంబయి నుంచి పంపించిన శాంపిళ్లలో 99.13 శాతం ఒమిక్రాన్‌గా తేలినట్లు వెల్లడించారు.

ఆందోళన వద్దు..: ముంబయిలో మహిళకు సోకింది ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ అని చెప్పే శాస్త్రీయ ఆధారాలేమీ ఇంతవరకు లభించలేదని ‘సార్స్‌ కోవ్‌-2 జినోమిక్స్‌ కన్సార్షియం - ఇన్సాకాగ్‌’ నిపుణులను ఉటంకిస్తూ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కేసును ‘ఎక్స్‌ఈ’గా బీఎంసీ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఇన్సాకాగ్‌ జన్యుక్రమ విశ్లేషణ జరుపుతోందని తెలిపాయి. ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ జనవరి నుంచి ఉందని.. దీనిపై ఆందోళన అవసరం లేదని దిల్లీలోని వైద్య, ఆరోగ్య రంగ నిపుణులు తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని