Updated : 09 Apr 2022 07:18 IST

Telangana News: రుక్మిణమ్మ మనసు వెన్న.. రూ.2 కోట్ల విలువైన ఇల్లు వితరణ

దాతృత్వం చాటిన మాజీ ఎమ్మెల్యే సతీమణి

ఖమ్మం మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే: మానసిక వ్యాధిగ్రస్థులు, అనాథలు, అభాగ్యులకు అన్నం సేవా ఫౌండేషన్‌ అందిస్తున్న సేవలకు చలించిపోయిన మాజీ ఎమ్మెల్యే సతీమణి ఖమ్మంలోని తన విలువైన ఇంటిని వితరణగా అందించి మానవతను చాటుకున్నారు. పూర్వ ఖమ్మం జిల్లాలోని సుజాతనగర్‌ నియోజకవర్గానికి మొదటి శాసన సభ్యుడిగా బొగ్గారపు సీతారామయ్య సేవలందించారు. ఆయన మరణానంతరం సతీమణి రుక్మిణమ్మ ఖమ్మంలోని మామిళ్లగూడెంలో నివాసముంటున్నారు. ఖమ్మంలో అభాగ్యులకు సేవలందిస్తున్న అన్నం సేవా ఫౌండేషన్‌కు తన వంతు సాయం చేయాలని సంకల్పించారు. పసుపు కుంకుమల కింద పుట్టించి నుంచి లభించిన, ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న ఇల్లు ఫౌండేషన్‌కు చెందేలా వీలునామా రాసి, రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇటీవల సంబంధిత దస్తావేజులను ఫౌండేషన్‌ ఛైర్మన్‌ అన్నం శ్రీనివాసరావుకు అందజేశారు. ఆ ఇంటి విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ‘స్వాతంత్య్ర సమరయోధుడైన నా భర్త సీతారామయ్య బతికున్న రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పేరు శాశ్వతంగా జిల్లా ప్రజలకు గుర్తుండాలనే కోరికతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఫౌండేషన్‌ కొనసాగినంత కాలం నా భర్త జ్ఞాపకార్థం అన్నదానం జరుగుతూనే ఉండాలనేది నా ఆకాంక్ష’ అని రుక్మిణమ్మ ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే నెల 7న సీతారామయ్య వర్ధంతి నాడు ఆయన కాంస్య విగ్రహాన్ని అదే ఇంటి ఎదుట ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts