పప్పుధాన్యాలు, పత్తి, సోయా మేలు

వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్న వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో వరి, మొక్కజొన్న, పసుపు పంటలు సాగు చేస్తే మంచి ధరలు లభించవని, లాభాలు వచ్చే అవకాశాలు లేవని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ

Updated : 24 May 2022 12:12 IST

మొక్కజొన్న, పసుపు, వరి.. గిట్టుబాటు కష్టమే

వానాకాలం పంటల సాగుపై జయశంకర్‌ వర్సిటీ అంచనా

అధిక ధరలొచ్చే పంటలే వేయాలని రైతులకు సూచన

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్న వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో వరి, మొక్కజొన్న, పసుపు పంటలు సాగు చేస్తే మంచి ధరలు లభించవని, లాభాలు వచ్చే అవకాశాలు లేవని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది. రైతులు ఏది సాగుచేస్తే ఎంత ధర వస్తుందనే అంశంపై వర్సిటీ ‘మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌’ (ఎంఐసీ) జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర మార్కెట్ల సరళి, ప్రజల అవసరాలు, డిమాండుపై పరిశోధన చేసింది. జూన్‌- సెప్టెంబరు మధ్య వానాకాలం పంటలను రైతులు సాగు చేసి.. సెప్టెంబరు- ఏప్రిల్‌ మధ్య మార్కెట్లలో విక్రయిస్తారు.అప్పుడు వ్యాపారులు క్వింటాకు ఎంత ధరను చెల్లించవచ్చనే అంచనాలను ఎంఐసీ తయారుచేసింది. ఇప్పటికే రాష్ట్రంలో, దేశంలో ఉన్న వివిధ పంటల నిల్వలు, వాటి ధరలెలా ఉన్నాయి, వానాకాలంలో వివిధ రాష్ట్రాల్లో ఏ పంట ఎంత సాగుకావచ్చు, వాటి ఎగుమతులు, ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల అంచనాలను తయారుచేసి మార్కెట్‌ ధర ఏ స్థాయిలో ఉంటుందనేది విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ ధరల అంచనాలను రైతులకు ముందుగానే వివరించి పంటల సాగుపై వారికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు, ప్రాంతీయ పరిశోధనాకేంద్రాల శాస్త్రవేత్తలకు సూచించింది.

వరి ధాన్యం దిగుబడులతో...

గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా వరిధాన్యం దిగుబడులు పుష్కలంగా రావడంతో కేంద్రం కూడా ఈ యాసంగిలో బియ్యం కొనుగోలును తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కొంటోంది. ఈ నేపథ్యంలో వానాకాలంలో వరి సాగుచేస్తే ధాన్యానికి మద్దతు ధరకు మించి రాకపోవచ్చని, లాభాలుండవని అంచనా. ఉదాహరణకు వరిధాన్యం సాధారణ రకానికి వచ్చే గతేడాది(2021) అక్టోబరు నుంచి వచ్చే 2022 సెప్టెంబరు వరకూ క్వింటాకు రూ.1940 చొప్పున మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం గతంలో ప్రకటించింది. ఇప్పుడు రైతులకు అంతే ఇచ్చి రాష్ట్రప్రభుత్వం కొంటోంది. రానున్న సీజన్‌లో సాగుచేయగా వచ్చే సాధారణ వరి ధాన్యానికి క్వింటాకు రూ.1650 నుంచి గరిష్ఠంగా 1960 రూపాయలు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని ఎంఐసీ తేల్చింది. గతేడాదికన్నా క్వింటాకు రూ.50 నుంచి 100 రూపాయల వరకూ పెంచాలని రైతులు కేంద్రాన్ని కోరుతున్నారు. ఒకవేళ కనిష్ఠంగా వరి ధాన్యానికి క్వింటాకు రూ.50 అదనంగా కేంద్రం ఇచ్చినా మద్దతు ధర రూ.1940 నుంచి రూ.1990కి పెరుగుతుంది. అంటే అప్పుడిక కేంద్రం ప్రకటించే మద్దతు ధరకన్నా కూడా సాధారణ వరి ధాన్యానికి తక్కువ ధర వస్తుందని జయశంకర్‌ వర్సిటీ ఎంఐసీ అంచనా చెబుతోంది. ఈ లెక్కన వరి సాగుచేస్తే గిట్టుబాటు కావడం కష్టం. ఇప్పటికే పంటల సాగువ్యయం ఆకాశాన్నంటుతోంది. ఈ నేపథ్యంలో వరి, పసుపు, మక్క వంటి పంటలకు పెద్దగా ధర ఉండదని, పత్తి, సోయాచిక్కుడు, కంది, పెసర, మినుము వంటివి సాగుచేస్తే గిట్టుబాటు కావచ్చని రైతులకు వర్సిటీ పరిశోధనాసంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని