Updated : 26 May 2022 06:46 IST

నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ

హైదరాబాద్‌లో రెండున్నర గంటలపాటు మోదీ పర్యటన
ఐఎస్‌బీ ద్విదశాబ్ది ఉత్సవాలకు హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ గురువారం హైదరాబాద్‌లో దాదాపు రెండున్నర గంటలపాటు ఉండనున్నారు. ఆయన రాక సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో మోదీ దిగింది మొదలు తిరిగి చెన్నై వెళ్లే వరకూ ప్రతి అంశాన్నీ పోలీసులు కూలంకషంగా పర్యవేక్షిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ద్విదశాబ్ది వార్షికోత్సవాలతోపాటు స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్‌ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మధ్యాహ్నం 1.25 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 3.50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరుతారు. ఐఎస్‌బీలో కార్యక్రమం నిర్వహించే వేదికపై మూడు వరుసల్లో అతిథులు ఆసీనులవుతారు. ప్రధానికి కుడివైపు గవర్నర్‌ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎడమవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఛైర్మన్‌ హరీశ్‌ మొనవాని కూర్చుంటారు. వెనుక వరుసల్లో విద్యాసంస్థ ప్రొఫెసర్లు ఉంటారు. ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో ఉన్న పలువురు పారిశ్రామిక వేత్తలు కూడా ప్రధాని కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలకడానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను అధికార ప్రతినిధిగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.


ఐఎస్‌బీలో ప్రధాని కార్యక్రమాల సరళి ఇలా..

గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని ఐఎస్‌బీకి చేరుకుని తొలుత ఓ మొక్క నాటుతారు. అనంతరం విద్యా సంస్థ 20 ఏళ్ళ చరిత్రకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటోలను తిలకిస్తారు. సిబ్బందితో ఫొటో దిగుతారు. అనంతరం అతిథుల పుస్తకంలో సంతకం చేసి వేదికపైకి వస్తారు. ప్రధానికి స్వాగత సత్కారాల అనంతరం ఐఎస్‌బీ డీన్‌ స్వాగతోపన్యాసం, ఛైర్మన్‌ హరీశ్‌ మన్‌వాని ప్రసంగం ఉంటాయి. తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన స్మారక చిహ్నాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. అన్నిరంగాల్లో ప్రతిభ కనబరచిన 8 మంది విద్యార్థులకు ప్రధాని బంగారు పతకాలు, ధ్రువపత్రాలు అందజేస్తారు. ఆ తర్వాత ప్రధాని ప్రసంగం ఉంటుంది.3.15 గంటలకు ప్రధాని ఐఎస్‌బీ నుంచి నిష్క్రమిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విద్యాలయ ప్రాంగణాన్ని ఇప్పటికే ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ) తమ ఆధీనంలోకి తీసుకుంది.  


కార్యకర్తల కోసం 20 నిమిషాలు..

ఎస్‌బీ నుంచి బేగంపేట చేరుకున్న తర్వాత ప్రధానమంత్రి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భాజపా కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు. ఇందుకోసం 20 నిమిషాలు కేటాయిస్తారు. అనంతరం 3.55 గంటలకు చెన్నై బయలు దేరుతారు. ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి వస్తున్న సందర్భంగా స్థానిక పోలీసులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.


ఉన్నతస్థాయి సమావేశం

ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా పర్యటన సాఫీగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో సమీక్షించారు. ట్రాఫిక్‌ మళ్లింపులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts