Published : 26 May 2022 06:31 IST

చిన్నారులకు నేత్ర గండం

ముందస్తు జననంతో రెటినోపతి  
సుమారు 30-40 శాతం మందిలో నిర్ధారణ
కరోనా కాలంలో రెట్టింపైన ముప్పు
వైద్యుల్లో అవగాహన అవసరమంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌

రోనా లాక్‌డౌన్‌ విధించిన 2020లో ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులకు నెలలు నిండకుండా కవలలు పుట్టారు. వారి వయసు పెరుగుతున్న కొద్దీ చూపులో తేడా ఉన్నట్లు తల్లిదండ్రులు గ్రహించారు. ఏడాది తర్వాత ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించారు. కవలలిద్దరికీ ‘ముందస్తు జననం కారణంగా రెటినోపతి-రెటినోపతి ఆఫ్‌ ప్రీమెచ్యూరిటీ(ఆర్‌ఓపీ)’ ఉన్నట్లుగా నిర్ధారించారు. వారు పుట్టిన నెలలోపు అత్యవసర చికిత్స నిర్వహించి ఉంటే కంటి చూపువచ్చే అవకాశాలుండేవని చెప్పారు. అయినా వైద్యులు తమ వంతుగా ప్రయత్నించి.. శస్త్రచికిత్స చేపట్టి 30 శాతం చూపు తేగలిగారు. ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలా నెలలు నిండకుండా పుట్టిన పసిపాపల నిదుర కళ్లను ‘రెటినోపతి’ కాటేస్తోంది. ముందుగా పుట్టిన చిన్నారుల్లో దాదాపు 30-40 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 15 శాతం మంది కోలుకునే అవకాశాల్లేక అంధత్వం వస్తుంది. ఆర్‌ఓపీ సమస్య వచ్చినవారిలో 80-90 శాతం మంది కొవిడ్‌ కాలంలో సకాలంలో చికిత్సను పొందలేకపోవడంతో.. దాదాపు 60 శాతానికి పైగా పూర్తి అంధత్వం బారిన పడినట్లు నిపుణులు చెబుతున్నారు. మిగిలిన 40 శాతం మంది కొద్దిపాటి చూపువచ్చినా పెద్ద వస్తువులను మాత్రమే చూడగలరు. మనుషుల ముఖాలను గుర్తించలేరు. ఈ పరిస్థితి తెలంగాణలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పుట్టిన పిల్లల్లో ఎదురైందని నిపుణులు చెబుతున్నారు.

ఏమిటీ ఆర్‌ఓపీ?

అవయవాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకముందే జన్మించడంతో.. కొందరిలో కంటి అంతర్భాగంలోని ‘రెటీనా’ పొర అసమతౌల్యంగా ఏర్పడుతుంది. అయితే ఈ సమస్య ఉన్నట్లు గుర్తించకపోవడంతో శిశువులు శాశ్వత అంధత్వానికి గురవుతున్నారు. మరీ 1000 గ్రాముల కంటే తక్కువగా పుట్టిన చిన్నారులనైతే 21-25 రోజుల్లోపే రెటినోపతి పరీక్ష చేయాలి. అంతకంటే ఎక్కువ బరువున్న పిల్లల్ని 30-35 రోజుల్లోపు పరీక్షించినా పరవాలేదు. మూణ్నాలుగు నెలల్లోపు సమస్య గుర్తించలేకపోతే.. శాశ్వతంగా అంధత్వం బారినపడే ప్రమాదముంది. ఎక్కువమంది వైద్యులకు కూడా ఆర్‌ఓపీని గుర్తించడంపై అవగాహన లేదు. ఆర్‌ఓపీ పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ వైద్యంలో పెంచాలి. ప్రస్తుతం గాంధీ, నిలోఫర్‌, సంగారెడ్డి, సరోజినీదేవి, ఎంజీఎం, నల్గొండ తదితర కొన్ని వైద్యకేంద్రాల్లో మాత్రమే ఈపరీక్షలు చేస్తున్నారు. ఎంబీబీఎస్‌ దశలోనే వైద్యులకు ఈ అంశంపై శిక్షణ ఇవ్వాలి.


గుర్తించలేకపోవడమే ప్రధాన సమస్య
-డాక్టర్‌ యాదయ్య, నవజాత శిశువుల వైద్య నిపుణులు, ఎస్‌ఎన్‌సీయూ, నల్గొండ

ల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కరోనా రాక ముందు సంవత్సరం 2019లో ముందస్తుగా పుట్టిన 371 మంది పిల్లలకు ఆర్‌ఓపీ పరీక్షలు నిర్వహించగా.. 32 మందిలో సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. కరోనాకాలం 2020లో 272 మందికి పరీక్షలు నిర్వహించగా.. 11 మందికి ఆర్‌ఓపీ ఉన్నట్లు తేలింది. 2021లో 286 శిశువులను పరీక్షిస్తే... 13 మందికి ఆర్‌ఓపీ బయటపడింది. వీరిలో 72 శాతం మంది గ్రామీణులే. తల్లిదండ్రులకు కూడా ఆర్‌ఓపీ ప్రాధాన్యం తెలియదు. పిల్లలు నెలలు నిండకుండా 1700-1800 గ్రాముల కన్నా తక్కువ బరువుతో పుడితే.. అలాంటివారిలో ఆర్‌ఓపీ సమస్య వచ్చే అవకాశాలున్నాయనే అవగాహన ముందుగా వైద్యుల్లో ఉండాలి. తప్పనిసరిగా ఆ కోణంలో చిన్నారులను పరీక్షించాలి.


నెలలోపు చికిత్సతో మెరుగైన ఫలితాలు
-డాక్టర్‌ సుభద్ర జలాలీ, పిల్లల రెటినా స్పెషలిస్టు, ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రి

యటినుంచి పిల్లల కన్ను చూడడానికి సాధారణంగానే ఉంటుంది. పరీక్షిస్తే తప్ప ఆర్‌ఓపీ ఉన్నట్లుగా తెలియదు. వ్యాధి ముదిరిన తర్వాత శస్త్రచికిత్స చేసినా చూపు పూర్తిగా వచ్చే అవకాశాలు తక్కువే. కరోనాకు ముందు రోజుకు 2-3 మంది చిన్నారులు ఆర్‌ఓపీ సమస్యతో వచ్చేవారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ తర్వాత రోజుకు 7-8 మంది వస్తున్నారు. 2020కి ముందు రోజుకు ఆర్‌ఓపీకి సంబంధించి 7-8 ఆపరేషన్లు చేసేదాన్ని. ఇప్పుడు రోజుకు సుమారు 15 వరకు చేస్తున్నా. లాక్‌డౌన్‌ సమయంలో ఎవరైతే సమస్య గుర్తించగలిగారో వారి పిల్లలకు చూపు లభించింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌, నైజీరియా నుంచి శిశువులను ఈ సమస్యతో ఇక్కడికి తీసుకువస్తున్నారు. ఆర్‌ఓపీ వచ్చినవారికి నెలలోపు చికిత్స అందించాలి.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని