‘మోడల్‌’ విద్యార్థులకు శిక్షణ ఏదీ?

ఏడాది పొడవునా కాకున్నా కనీసం వేసవి కాలంలో అయినా ఎంసెట్‌, నీట్‌ కోచింగ్‌ లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శ పాఠశాలల్లో చదివే ఇంటర్‌ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. శిక్షణ ఇప్పించడంపై పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి.

Published : 27 May 2022 05:35 IST

ఎంసెట్‌, నీట్‌ కోచింగ్‌ను పట్టించుకోని పాఠశాల విద్యాశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: ఏడాది పొడవునా కాకున్నా కనీసం వేసవి కాలంలో అయినా ఎంసెట్‌, నీట్‌ కోచింగ్‌ లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శ పాఠశాలల్లో చదివే ఇంటర్‌ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. శిక్షణ ఇప్పించడంపై పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో 194 మోడల్‌ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యనందిస్తున్నారు. వాటిల్లో సుమారు 6 వేల మంది ఎంపీసీ, బైపీసీ గ్రూపు విద్యార్థులున్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మార్కుల ప్రతిభ ఆధారంగా గతంలో రాష్ట్రంలో పాలమాకుల, చౌటుప్పల్‌, కమలాపూర్‌, వంచనగిరి ఆదర్శ పాఠశాలల్లో బాలికలు, బాలురకు వేర్వేరుగా ఎంసెట్‌, నీట్‌ శిక్షణ ఇచ్చేవారు. కరోనాతో 2020, 2021లలో ఆపేశారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు ఉన్నా పాఠశాల విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. ఇంటర్‌ పరీక్షలు ఈనెల 24తో ముగిశాయి. ఇప్పటివరకు కనీసం దరఖాస్తులను ఆహ్వానించలేదు. కాలపట్టికను జారీ చేయలేదు. మరో వైపు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్‌ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒకటీ రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామని, ఆన్‌లైన్‌ విధానంలో కోచింగ్‌ అందిస్తామని ఆ వర్గాలు తెలిపాయి. వివిధ సంక్షేమ గురుకులాల విద్యార్థులకు కూడా శిక్షణను ప్రారంభిస్తున్నాయి. మోడల్‌ పాఠశాలల విద్యార్థులకు శిక్షణ గురించి కనీసం అధికారులు, ఉన్నతాధికారులకు ప్రతిపాదనలే సమర్పించకపోవడం గమనార్హం. విద్యార్థులు మాత్రం కోచింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందని  ప్రిన్సిపాళ్లను అడుగుతున్నారు. కనీసం నెల రోజులు మార్గదర్శకం లభించినా మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉందని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌(టీఎస్‌ఎంటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని