కాన్పుకెళితే కోతలే

పెద్దపల్లి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏప్రిల్‌ 2021 నుంచి ఈనెల 20 వరకూ 2,230 కాన్పులు జరగ్గా.. ఇందులో 191 మాత్రమే సహజ ప్రసవాలు.. మిగిలిన 2,035(91 శాతం) కాన్పు కోతలే. మొత్తం 18 ఆసుపత్రుల గణాంకాలను పరిశీలించగా.. 6 ఆసుపత్రుల్లో నూరుశాతం సిజేరియన్లే. మరో 8 ఆసుపత్రుల్లో 90 శాతానికి పైగా కాన్పు కోతలే. 

Updated : 28 May 2022 06:45 IST

 దేశం మొత్తమ్మీద రాష్ట్రంలోనే కోత కాన్పులు అధికం 
కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వందశాతం  
అడ్డుకట్ట వేసేలా సర్కారు కార్యాచరణ 
ఆరోగ్యశ్రీలో సిజేరియన్లకు చెల్లింపులు నిలిపివేత 

ఈనాడు - హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రసవ కోతలు(సిజేరియన్లు) పెరిగిపోతున్నాయి. దేశం మొత్తమ్మీద తెలంగాణ ప్రైవేటు దవాఖానాల్లో అత్యధికంగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. మరోవైపు సర్కారు ఆసుపత్రుల్లోనూ సిజేరియన్లు ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కలుపుకొని సగటున 60.7 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో అధికంగా 82.4 శాతం, తక్కువగా కుమురంభీం జిల్లాలో 27.2 శాతం నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు కోతల రాష్ట్ర సగటు 44.5 శాతం కాగా, అత్యధికంగా జనగామ జిల్లాలో 73 శాతం జరుగుతున్నాయి. ప్రభుత్వ సగటు కన్నా ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం 48.6 శాతం, జగిత్యాలలో 64.9 శాతం, కరీంనగర్‌లో 66.8 శాతం నమోదయ్యాయి. అదే కర్ణాటకలో 28 శాతం, మహారాష్ట్రలో 31 శాతం మాత్రమే సిజేరియన్లు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడం ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. 

* పెద్దపల్లి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏప్రిల్‌ 2021 నుంచి ఈనెల 20 వరకూ 2,230 కాన్పులు జరగ్గా.. ఇందులో 191 మాత్రమే సహజ ప్రసవాలు.. మిగిలిన 2,035(91 శాతం) కాన్పు కోతలే. మొత్తం 18 ఆసుపత్రుల గణాంకాలను పరిశీలించగా.. 6 ఆసుపత్రుల్లో నూరుశాతం సిజేరియన్లే. మరో 8 ఆసుపత్రుల్లో 90 శాతానికి పైగా కాన్పు కోతలే. 

*జగిత్యాల జిల్లాలో ఏప్రిల్‌ 2021 నుంచి ఈఏడాది మార్చి వరకూ ప్రసవాలను పరిశీలిస్తే.. 39 ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,016 ప్రసవాలు చేయగా.. ఇందులో 7,844(87 శాతం) కాన్పు కోతలు నిర్వహించారు. వీటిల్లోనూ 3,637(40.3 శాతం) తొలికాన్పు కోతలే కావడం గమనార్హం. ఇందులో 22 ప్రైవేటు ఆసుపత్రుల్లో 90 శాతానికి పైగా సిజేరియన్లే చేశారు.

మిడ్‌వైఫరీ వ్యవస్థ అమలు 

సహజ కాన్పుల కోసం ‘మిడ్‌వైఫరీ నర్సింగ్‌’ శిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. కాన్పు సమయంలో ముప్పు అధికంగా ఉన్నవారు.., సహజ ప్రసవానికి ఆటంకాలు లేనివారు ఏయే ఆసుపత్రులకు వెళ్లాలనేది ముందుగానే సూచిస్తారు. గర్భిణి దశ నుంచే సహజ కాన్పునకు అవసరమయ్యే తేలికపాటి వ్యాయామాలను చేయిస్తారు. నొప్పుల సమయంలో గైనకాలజిస్ట్‌ పర్యవేక్షణలో సుశిక్షితులైన నర్సులు కాన్పులో కీలకపాత్ర పోషిస్తారు. కాన్పు గదిలో కూడా భర్త పక్కనే ఉండేలా ప్రోత్సహిస్తారు. తద్వారా గర్భిణి మానసిక స్థైర్యంతో ప్రసవానికి సిద్ధపడేలా చేస్తారు. ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ కింద సిజేరియన్‌ చేస్తే ప్రభుత్వం రూ.11 వేలు ఇస్తుండగా.. దీన్ని నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో సాధారణ ప్రసవానికి రూ.3 వేల చొప్పున నగదు పారితోషికాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. 

వైద్యశాఖ మంత్రి హరీశ్‌ చొరవ 

కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని అమలు చేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుంచి 56 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో కాన్పు కోతలు పెరగడంతో దీన్ని తగ్గించడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ... ‘ఏ జిల్లాకు వెళ్లినా ఇదే విషయంపై ప్రైవేటు వైద్యులతో సమావేశమవుతున్నాను. సిజేరియన్లను తగ్గించడంపై దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను.  ప్రసవ కోతలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్లకూ ఆదేశాలిచ్చాం’’ అని వివరించారు.  

తొలికాన్పు సిజేరియన్‌ కాకుండా చూడాలి: డాక్టర్‌ బాలాంబ, సీనియర్‌ గైనకాలజిస్ట్‌  

తొలికాన్పు సిజేరియన్‌ అయితే.. అత్యధిక సందర్భాల్లో రెండో కాన్పు కూడా సిజేరియనే చేయాల్సి వస్తుంది. అందువల్ల తొలి కాన్పులో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే తప్ప సిజేరియన్‌ జోలికివెళ్లొద్దు.  ప్రసవ నొప్పులను గర్భిణులు భరించలేకపోవడం కూడా కోత కాన్పులకు మరో కారణం. అప్పట్లో ఇంట్లో పెద్దవారు నొప్పుల సమయంలో పక్కనే ఉండి ధైర్యం చెప్పేవారు.  ఇప్పుడా పరిస్థితి లేదు. సిజేరియన్‌ చేసేయమని వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు.   కొందరు వైద్యులు వ్యాపారాత్మక ధోరణి కోత కాన్పుల సంఖ్య పెరగడానికి కారణం. 

 సహజ ప్రసవాలతో తల్లీబిడ్డకు మేలు 

సహజ ప్రసవం వల్ల తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. అదే సిజేరియన్‌ చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ రేటు ఎక్కువగా ఉంటుంది. కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. 35 ఏళ్ల వయసు వచ్చేసరికి తల్లి బరువైన పనులు చేసుకోలేకపోతోంది. పుట్టిన బిడ్డకు తొలిగంటలో తల్లి పాలివ్వడం అమృతంతో సమానం. రోగ నిరోధకశక్తి గణనీయంగా పెరుగుతుంది. శారీరక ఎదుగుదల, చురుకుదనం బావుంటుంది. సిజేరియన్‌ కారణంగా రాష్ట్రంలో కేవలం 36 శాతం మంది శిశువులకు తల్లులు తొలిగంటలో పాలు ఇవ్వగలుగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని