ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 07 May 2024 03:57 IST

రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, భూసేకరణ ప్రక్రియను కొనసాగించవచ్చని పేర్కొంది. తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ భవనం, జంక్షన్‌ కోసం.. జాతీయ రహదారుల చట్టం, భూసేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా 9 ఎకరాల సేకరణ చేపట్టారంటూ జి.శ్రీరాంరెడ్డి, గజ్వేల్‌ రెవెన్యూ డివిజన్‌లో 14 ఎకరాల సేకరణ ప్రక్రియను సవాల్‌ చేస్తూ ఆర్‌.అరులప్ప వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్‌ కె.శరత్‌ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 100 కిలోమీటర్లకంటే ఎక్కువ రోడ్డు నిర్మాణం చేపడతున్నట్లయితే పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు. మొత్తం 4,704 ఎకరాలకుగాను ప్రైవేటు భూములే 4,315 ఎకరాలున్నాయన్నారు. పట్టాభూములను సేకరించే ముందు పలు ప్రత్యామ్నాయాలున్నాయని వివరించారు. జాతీయ రహదారుల మండలి తరఫు న్యాయవాది ఎల్‌.పద్మారావు వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారమే భూసేకరణ చేపట్టామన్నారు. జాతీయ రహదారుల చట్టం కింద భూసేకరణకు పునరావాస, పునర్నిర్మాణ పథకం వర్తించదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎన్‌హెచ్‌ఏఐ, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ తదితరులకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్‌ 14కు వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్లను భూముల నుంచి ఖాళీ చేయించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని