దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మార్ఫింగ్‌ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Published : 07 May 2024 03:53 IST

అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో అరెస్ట్‌లు చేశాం
హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మార్ఫింగ్‌ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ సీసీఎస్‌ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘భాజపా ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్‌ 27నే హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే ‘ఎక్స్‌’కు లేఖ రాస్తే 72 గంటలు గడిస్తే గానీ సమాచారం ఇవ్వమన్నారు. ఆ తర్వాత కూడా కొర్రీ వేశారు.. కానీ చివరకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌లో ‘ఎక్స్‌’ ఖాతా నుంచే తొలుత వీడియో వచ్చిందని.. తర్వాత వైరల్‌ అయిందని తేలింది. అప్పుడు ఐదుగురిని అరెస్ట్‌ చేశాం. ప్రస్తుతం వారు షరతులతో కూడిన బెయిల్‌పై బయటికి వచ్చారు. మాకున్న సమాచారం మేరకు దిల్లీ పోలీసులు ఏప్రిల్‌ 28న కేసు నమోదు చేశారు. దాదాపు ఒకే అంశంతో కూడిన కేసులో రెండు సంస్థలు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. ఇదే విషయం ఇటీవలే దిల్లీ పోలీస్‌శాఖకు చెందిన డీసీపీకి చెప్పాం. ఇక్కడి కేసుకు సంబంధించిన సమాచారాన్ని అడిగితే దిల్లీ పోలీసులకు అధికారికంగా అప్పగించాం. హైదరాబాద్‌లో దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో దిల్లీ పోలీసులు ఎలాంటి గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. మార్ఫింగ్‌ ఎలా జరిగిందనేది సైబర్‌ ఫోరెన్సిక్‌ ద్వారా తేలుతుంది..’ అన్నారు.

త్వరలో ఫోన్‌ ట్యాపింగ్‌ కుట్రదారులు బయటికొస్తారు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎంతటివారున్నా వదిలిపెట్టబోమని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ట్యాపింగ్‌ కేసుపై మాట్లాడుతూ ‘ఇప్పటికే పోలీస్‌ అధికారులను అరెస్ట్‌ చేశాం. రాజకీయనేతల ప్రమేయం తేలితే అరెస్ట్‌ చేస్తాం. నిందితులు హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినా దర్యాప్తుపై ప్రభావం ఉండబోదు. కేసును పునాది స్థాయి నుంచి నిర్మిస్తున్నాం.. గోడలు లేకుండా కప్పు వేయలేం కదా..! శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగించి పకడ్బందీగా ఆధారాలు సేకరిస్తున్నాం. కీలక నిందితుడు ప్రభాకర్‌రావును అరెస్ట్‌ చేసేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకున్నాం. రెడ్‌కార్నర్‌ నోటీసు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తున్నాం.. ఆయన్ని రప్పించాక మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి. ప్రస్తుతం పాత్రధారులు బయటికొచ్చారు.. త్వరలోనే కుట్రదారులు బయటికొస్తారు’ అని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభాకర్‌రావు కుటుంబసభ్యులకు కేసుతో సంబంధముందా..? అని అడిగిన ప్రశ్నకు ఇప్పటివరకు అలాంటిదేమీ తేలలేదన్నారు. మీడియా అనవసరంగా కుటుంబసభ్యులను కేసులోకి లాగొద్దని ఆయన హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని