కవితకు బెయిల్‌ నిరాకరణ

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్‌ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది.

Updated : 07 May 2024 05:53 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్‌ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది. తనపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆమె పెట్టుకున్న వేర్వేరు దరఖాస్తులను ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తిరస్కరించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు వెలువరించారు. కవితను ఈ కేసులో ఈడీ మార్చి 15న, సీబీఐ ఏప్రిల్‌ 11న అరెస్ట్‌ చేశాయి. దిల్లీ మద్యం విధానాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి వీలుగా ఆప్‌ అగ్రనేతలకు ఆమె రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ. ఈ కేసులో ఆమె కీలక పాత్రధారి కాబట్టి బెయిల్‌ ఇవ్వొద్దని, దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆమె బయటికొస్తే సాక్షులు, సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. మహిళగా, భారాస స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న ఆమెకు బెయిల్‌ మంజూరు చేయాలని కవిత న్యాయవాదులు కోరారు. ఆమె ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జగన్‌, నిమ్మగడ్డ కేసుల్లో సుప్రీం  ఉత్తర్వుల్లోని అంశాల ఆధారంగా..

‘ఆర్థిక నేరాల వెనుక లోతైన కుట్రలు ఉంటాయి. ఆ నేరాలు దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీసేవిగా పరిగణించాలని గతంలో నిమ్మగడ్డ ప్రసాద్‌ వర్సెస్‌ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది’ అని న్యాయమూర్తి కావేరీ బవేజా... కవిత బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక నేరాల కేసుల్లో బెయిల్‌ మంజూరు చేసే విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందన్నారు.

  •  ‘‘బెయిల్‌ మంజూరు చేసేటప్పుడు నిందితులపై ఉన్న ఆరోపణల స్వభావాన్ని, వాటికి మద్దతుగా ఉన్న సాక్ష్యాల స్వరూపాన్ని, నేర నిరూపణ జరిగితే పడే శిక్ష తీవ్రతను, నిందితుల ప్రవర్తనను, వారుండే పరిస్థితులను, ట్రయల్‌ జరిగే సమయంలో వారు హాజరు కావడానికున్న అవకాశాలను, సాక్ష్యాలను తారుమారు చేయడానికున్న అవకాశాలను, ప్రజలు/ప్రభుత్వ విస్తృత ప్రయోజనాలను న్యాయస్థానాలు దృష్టిలో ఉంచుకోవాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్సెస్‌ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది.
  •  ఆరోపిత నేరాల్లో కవిత పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. ఫోన్లను తన సిబ్బందికి ఇస్తే.. వారు ఫార్మాట్‌ చేసి తిరిగిచ్చారన్న కవిత వాదన ఆమోదయోగ్యంగా కనిపించడం లేదు. డిజిటల్‌ పరికరాలు తీసుకుని విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసిన తర్వాత ఆ ఫోన్లను ఫార్మాట్‌ చేసినట్లు ఫోరెన్సిక్‌ రిపోర్టు ప్రకారం తెలుస్తోంది. కొన్ని పరికరాలను దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కావడానికి ముందు రోజు ఫార్మాట్‌ చేశారు. ఇది ఆమె తీరుపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
  •  అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని బెయిల్‌ ఇవ్వాలని అడిగారు. అయితే ఆమె సమర్పించిన డాక్యుమెంట్లు ఏవీ వైద్య కారణాలపై బెయిల్‌ ఇవ్వాల్సినంత తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలియజేయడం లేదు.
  •  ఆరోపిత నేరంలో నిందితురాలి ప్రత్యక్ష భాగస్వామ్యం, నేర ప్రభావం, ఆర్థిక నేరాల స్వభావం తీవ్రతను  ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకొని ఆమె రెండు బెయిల్‌ దరఖాస్తులను డిస్మిస్‌ చేస్తున్నాం. ఈ అభిప్రాయాలను కేసు మెరిట్స్‌పై వ్యక్తం చేసినవిగా భావించరాదు’’ అని న్యాయమూర్తి కావేరీ బవేజా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కవితను నేరుగా కోర్టులో ప్రవేశపెట్టడానికి అనుమతి

జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న తనను కోర్టు విచారణ సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాకుండా నేరుగా ప్రవేశపెట్టేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని కోరుతూ కవిత చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి కావేరి బవేజా పరిగణనలోకి తీసుకున్నారు. ఇక మీదట కోర్టు విచారణ సమయంలో అవసరమైనప్పుడు ఆమెను నేరుగా హాజరుపరచాలని సీబీఐ, ఈడీ అధికారులను ఆదేశించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత జ్యుడిషియల్‌ రిమాండ్‌ మంగళవారం ముగుస్తుండడంతో ఆమెను దర్యాప్తు సంస్థల సిబ్బంది మధ్యాహ్నం 2 గంటలకు రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని