కొనసాగిన తీవ్ర ఎండలు

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

Published : 07 May 2024 04:00 IST

నల్గొండలో ఈదురుగాలుల ధాటికి పంట నష్టం
నేడు ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఈనాడు, హైదరాబాద్‌- సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా మహాముత్తారంలో 46.4, జగిత్యాల జిల్లా కొల్వాయి, పెద్దపల్లి జిల్లా  సుగ్లాంపల్లిలో 46.3, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 46.2, జగిత్యాల జిల్లా గోధూరులో 46.1, మంచిర్యాల జిల్లా నర్సాపూర్‌, ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణిలో 46 డిగ్రీల ఎండ కాసింది. 15 జిల్లాల్లోని 43 మండలాల్లో వడగాలులు వీచాయి. సూర్యాపేట జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి మామిడి, అరటితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని ఆత్మకూర్‌(ఎస్‌), నాగారం, మద్దిరాల, తిరుమలగిరి, తుంగతుర్తి, పెన్‌పహాడ్‌లో, చివ్వెంల మండలాల్లో మామిడి తోటలు అధికంగా దెబ్బతిన్నాయి.

మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో మంగళ, బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. మంగళవారం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, యాదాద్రి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. 


పిడుగుపాటుకు ఒకరు.. వడదెబ్బతో నలుగురి మృతి

నల్గొండ జిల్లా కనగల్‌ మండలం జి.యడవల్లిలో తలారి ఊశయ్య(59) ఆదివారం సాయంత్రం కల్లు దింపిన అనంతరం గ్రామానికి చెందిన దోతి కృష్ణయ్యతో కలిసి ఇంటికి బయలుదేరారు. దారి మధ్యలో వారి సమీపంలోనే పిడుగు పడటంతో ఊశయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. కృష్ణయ్యకు గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా జగిత్యాల గ్రామీణ మండలం మోతె గ్రామానికి చెందిన సంగెపు గంగరాజు(42) అనే మహిళ, హైదరాబాద్‌ మూసాపేట పరిధిలో కైత్లాపూర్‌ ప్రధాన రోడ్డు పక్కన కర్ణాటక రాష్ట్రం కరంజి గ్రామానికి చెందిన రాజు(40) అనే యాచకుడు, నిర్మల్‌ జిల్లా బాసరలోని కూతురి ఇంటికి వచ్చిన మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా శివపూర్‌కు చెందిన సోన్‌కాంబ్లే ఉత్తమ్‌(65), కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన పంజాల భారతి(55) వడదెబ్బతో మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని