కొత్త పీఆర్‌సీలో 51 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి

రాష్ట్రంలో కొత్త పీఆర్‌సీలో 51 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరింది.

Published : 07 May 2024 03:58 IST

టీఎన్జీవోల ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త పీఆర్‌సీలో 51 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరింది. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని అభ్యర్థించింది. సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌, సహాధ్యక్షుడు కస్తూరి వెంకట్‌, సత్యనారాయణగౌడ్‌, ఇతర నేతలు లక్ష్మణ్‌, ముజీబ్‌, కొండల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులు సోమవారం శివశంకర్‌ను బీఆర్‌కే భవన్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి కొత్త పీఆర్‌సీపై తమ ప్రతిపాదనలు సమర్పించారు. కనిష్ఠ వేతనం రూ.35 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,99,100గా ఉండాలని, కనీస పెన్షన్‌ మొత్తాన్ని రూ.17,500కి పెంచాలని, గ్రాట్యుటీ రూ.24 లక్షలు, 15 సంవత్సరాల సర్వీసు నిండిన వారికి మొత్తం పెన్షన్‌ ఇవ్వాలని, ఇంటి నిర్మాణ అడ్వాన్స్‌ రూ.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగినులకు శిశు సంరక్షణ సెలవులు ఇవ్వాలని, ఉద్యోగులు చనిపోతే దహన ఖర్చుల సాయం రూ.75 వేలకు పెంచాలని టీఎన్జీవో నేతలు కోరారు.

జీవన వ్యయానికి అనుగుణంగా పీఆర్‌సీ ఇవ్వాలి: ఇంటర్‌ విద్యా ఐకాస

రాష్ట్రంలో ఉద్యోగుల జీవన వ్యయానికి అనుగుణంగా వేతన సవరణ చేయాలని ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరింది. ఇంటర్‌ విద్యా ఐకాస ఛైర్మన్‌ పి.మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘం నేతలు కృష్ణకుమార్‌, రామారావు, రవీందర్‌రెడ్డి, రామానుజాచార్యులు శివశంకర్‌ను కలిసి తమ ప్రతిపాదనలు ఇచ్చారు. తెలంగాణలో పెరిగిన సగటు జీవన వ్యయం (వినియోగ వ్యయం) మిగతా రాష్ట్రాల కంటే పెద్ద ఎత్తున పెరిగిందని, తద్వారా జీతభత్యాలపై ఆధారపడే వేతన జీవుల జీవన ప్రమాణాలపైన తీవ్ర ప్రభావం పడిందని, దీనిని ఆధారంగా చేసుకొని వేతన సవరణ చేపట్టాలని కోరారు.

సమాన పనికి సమాన వేతనం: ఆర్‌యూపీపీటీ

కొత్త పీఆర్‌సీలో భాషాపండితులకు న్యాయం చేయాలని, ప్రాథమికోన్నత, హైస్కూళ్లలో బోధిస్తున్న వారికి స్కూల్‌ అసిస్టెంట్‌ వేతనం అందించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌(ఆర్‌యూపీపీటీ) పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మహమ్మద్‌ అబ్దుల్లా, తిరుమల కాంతి కృష్ణ ఇతర నేతలు దేవేందర్‌, హమీద్‌ తదితరులు శివశంకర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి తమ ప్రతిపాదనలు అందజేశారు. ఇప్పటివరకు కేవలం రూ.150 అదనపు వేతనం ఇస్తూ భాషా పండితులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని సమాన పనికి సమాన వేతనం భాషా పండితులకు వర్తింపజేయాలని కోరారు. ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు వైద్యబిల్లుల చెల్లింపు సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యోగినులకు శిశుసంరక్షణ సెలవులను ఏడాదికి పెంచాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని