వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 07 May 2024 03:56 IST

 రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్నందున తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా వసతి గృహాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి జూన్‌ 10వ తేదీలోగా నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ గురుకుల  వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వసతులను మెరుగుపరిచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కె.అఖిల్‌ శ్రీగురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. గత 60 రోజుల్లో కలుషిత ఆహారంతో 100 మందికిపైగా పిల్లలు అనారోగ్యం పాలయ్యారని, అందులో ముగ్గురు మృతి చెందారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,800 వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో 7.58 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నారన్నారు. 52 వేలకు పైగా మరుగుదొడ్లు, 30 వేలకు పైగా స్నానపు గదుల కొరత ఉందన్నారు. వంట గదులు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పేద పిల్లలు తమ చదువులపై దృష్టి సారించలేకపోతున్నారన్నారు. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ వసతి గృహాల్లో కొన్ని అసౌకర్యాలున్న మాట వాస్తవమేనన్నారు. ప్రస్తుత వేసవి సెలవుల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ శాఖలు చర్యలు తీసుకుంటాయని తెలిపారు. దీనికి అనుమతించిన ధర్మాసనం వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనపై అమలు నివేదికను సమర్పించాలంటూ విచారణను జూన్‌ 10వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు