మారిన ‘నీట్‌’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు

ఆసిఫాబాద్‌లోని మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన నీట్‌ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్‌ వెంకటేశ్‌కు ఫిర్యాదు చేశారు.

Published : 07 May 2024 03:50 IST

ఈనాడు, ఆసిఫాబాద్‌: ఆసిఫాబాద్‌లోని మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన నీట్‌ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్‌ వెంకటేశ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన డీఆర్వో లోకేశ్‌రావును విచారణకు ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన నీట్కు ఈ కేంద్రంలో 323 మందికి గాను 299 మంది హాజరయ్యారు. పట్టణంలోని ఎస్‌బీఐ, కెనరా బ్యాంకుల్లో ప్రశ్నపత్రాల సెట్లను భద్రపరిచారు. పరీక్ష రోజు ఉదయం 5 గంటలకు ఎన్‌టీఏ(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) అధికారులు ఏ ప్రశ్నపత్రం సెట్ తీసుకోవాలో ఈ-మెయిల్‌ లేదా ఫోన్‌ ద్వారా చెబుతారు. ఎన్‌టీఏ అధికారులు దేశవ్యాప్తంగా ఎస్‌బీఐకి అందించిన సెట్ ద్వారానే పరీక్ష నిర్వహించాలని అన్ని పరీక్ష కేంద్రాలకు ఆదేశాలు జారీ చేశారు. ఆసిఫాబాద్‌లో మాత్రం అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్‌ మధ్య సమన్వయం కొరవడటంతో కెనరా బ్యాంకు నుంచి వచ్చిన సెట్ను విద్యార్థులకు అందించారు. పరీక్ష రాసిన అనంతరం ఇతర జిల్లాల్లో ఇచ్చిన పేపర్‌ ప్రశ్నలను తమ మిత్రుల ద్వారా తెలుసుకున్న విద్యార్థులు కంగుతిన్నారు. దేశవ్యాప్తంగా ‘జీఆర్‌ఐడీయూ’ కోడ్‌తో ఉన్న ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించగా ఆసిఫాబాద్‌లో ‘ఎన్‌ఏజీఎన్‌యూ’ కోడ్‌తో నిర్వహించారు. ఇందులోని  ప్రశ్నలు కఠినంగా వచ్చాయని, రెండు, మూడు ప్రశ్నలు సిలబస్‌లో లేవని, ఇది ర్యాంక్‌పై చూపుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయమై ఎన్‌టీఏ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌.. ఆసిఫాబాద్‌ డీఆర్‌ఓ లోకేశ్‌రావుతో సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. ఇలాగే తమిళనాడులోని తూత్తుకుడి పట్టణంలోనూ 3 సెంటర్లలో ప్రశ్నపత్రం మారిందన్నారు. ఈ విద్యార్థుల పేపర్లను సైతం మూల్యాంకనం చేస్తామని, మిగతా ప్రశ్నపత్రాలలో వచ్చిన కఠిన, సులువు ప్రశ్నల నిష్పత్తిని, ఈ ప్రశ్నపత్రంతో బేరీజు వేసి మార్కులు కేటాయిస్తామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని