Updated : 25 Jun 2022 08:41 IST

Drones: మనుషుల్ని మోసుకెళ్లే డ్రోన్లు.. గమ్యానికి తీసుకెళ్లే సైకిళ్లు!

నయా ఆవిష్కరణలకు ఐఐటీ హైదరాబాద్‌ సన్నద్ధం

ఈనాడు, సంగారెడ్డి: ఇప్పటివరకు రిమోట్‌ ఆధారంగా పనిచేసే డ్రోన్లు మనకు తెలుసు.. అవి మనుషులనూ మోసుకెళితే...  రైల్వేస్టేషన్‌ లేదా బస్టాపులో దిగిన మీ వద్దకు సైకిల్‌ దానంతట అదే వచ్చి మీరు తొక్కకుండానే వెళ్లాల్సిన చోటుకు తీసుకెళితే... అలా ఎలా సాధ్యమని అనిపిస్తోందా? ఇవన్నీ సాకారం చేసేలా ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధనలు చేస్తోంది.

కేంద్ర శాస్త్రసాంకేతిక విభాగం దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలకు కొన్ని ప్రాజెక్టులు ఇచ్చి పరిశోధనలు చేయిస్తోంది. అందులో భాగంగా ఐఐటీ హైదరాబాద్‌కు రూ.135 కోట్లు అందించింది. చోదకులు లేకుండా నేలపై, నీటిలో, ఆకాశంలో నడిచే వాహనాలను రూపొందించేలా ఇక్కడ కృషి కొనసాగుతోంది. ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్లగలిగే డ్రోన్‌ను వారం రోజుల్లో పరీక్షించేందుకు రంగం సిద్ధమైంది. కొన్నేళ్లుగా ఈ అంశంపై పరిశోధనలు చేస్తున్న నిపుణులు ఐఐటీ ప్రాంగణంలో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించనున్నారు. డ్రైవర్‌ అవసరం లేకుండానే జీపీఎస్‌ ఆధారంగా నిర్దేశించిన గమ్యానికి ఈ డ్రోన్‌ మనుషులను తీసుకెళుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఎంపిక చేసిన కొన్ని చోట్ల వీటిని వినియోగించడంపై దృష్టి సారించనున్నారు.

ఆగిన చోటుకు వచ్చే సైకిల్‌

అటానమస్‌ నావిగేషన్‌ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్న ఐఐటీ పరిశోధకులు చోదకరహిత సైకిల్‌నూ అందుబాటులోకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. మనం బస్సు లేదా రైల్వేస్టేషన్‌లో దిగిన తర్వాత సైకిల్‌పై వెళ్లాలనుకుంటే... పార్కింగ్‌ ప్రదేశాల్లో ఉండే సైకిల్‌ మీ వద్దకు తనంతట తానే వచ్చేస్తుంది. ఎక్కి కూర్చున్న తర్వాత ఎక్కడికి వెళ్లాలో చెబితే చాలు తొక్కాల్సిన అవసరం లేకుండా నేరుగా మిమ్మల్ని గమ్యానికి చేర్చుతుంది. బ్యాటరీతో నడిచే దీన్ని పరీక్షించేందుకు మరికొంత సమయం పట్టనుంది.

డ్రైవర్‌ లేని వాహనంలో ప్రయాణించనున్న కేంద్రమంత్రి

చోదకుడు లేకుండా ప్రయాణించే వాహనాన్ని ఐఐటీ హైదరాబాద్‌ అభివృద్ధి చేసింది. కేంద్రశాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ జులై 4న ఇక్కడికి రానున్నారు. ఈ వాహనంలో ఆయన ఒక కిలోమీటరు దూరం ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంపస్‌లో ప్రయాణానికి కూడా చోదక రహిత ఈవీలనే ఉపయోగించనున్నారు.


చాలా అంశాల్లో కీలక పరిశోధనలు

- ఆచార్య బీఎస్‌మూర్తి, డైరెక్టర్‌, ఐఐటీ హైదరాబాద్‌

శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుత పరిశోధనలను ఇక్కడ చేస్తున్నాం. వచ్చే పదేళ్లలో చాలా విజయాలు సాధ్యమవుతాయి. యువ ఆచార్యులు, వెయ్యి మందికి పైగా పరిశోధక విద్యార్థులు ఇక్కడ ఉండడం మాకు కలిసొచ్చే అంశం. మెకానికల్‌, డిజైన్‌, ఎలక్ట్రానిక్స్‌.. ఇలా అన్ని విభాగాల సహకారంతో చోదకరహిత వాహనాలు, మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు తయారు చేశాం. వీటిని పరీక్షించేందుకు ఏర్పాట్లు చేశాం. రహదారి సదుపాయాలు లేని చోట, పర్వత ప్రాంతాల్లో, అత్యవసర సమయాల్లో నిర్దేశిత ప్రాంతాలకు మనుషులను తీసుకెళ్లేందుకు ఈ డ్రోన్లు చక్కగా పనికొస్తాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని