‘మన ఊరు- మన బడి’ టెండర్లు.. నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ

‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో పాఠశాలలకు రంగులు వేసే  పనులకు జారీ చేసిన టెండర్లను తమ అనుమతి లేకుండా ఖరారు చేయరాదని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. టెండర్ల ప్రక్రియ నిలిపివేతకు నిరాకరించింది. ఈ పనులకు

Published : 01 Jul 2022 06:10 IST

 అనుమతి లేకుండా ఖరారు చేయొద్దని ఆదేశం

జులై 6కు విచారణ వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో పాఠశాలలకు రంగులు వేసే  పనులకు జారీ చేసిన టెండర్లను తమ అనుమతి లేకుండా ఖరారు చేయరాదని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. టెండర్ల ప్రక్రియ నిలిపివేతకు నిరాకరించింది. ఈ పనులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలికాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) మే 9న జారీ చేసిన టెండరు  నోటిఫికేషన్‌లోని నిబంధనలను సవాలు చేస్తూ విశాఖపట్నానికి చెందిన ‘సువర్ణశ్రీ వెంకటేశ్వర ఇన్‌ఫ్రాకాన్‌ ఎల్‌ఎల్‌పీ’ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.నంద ఇటీవల ఈ ఆదేశాలు జారీచేశారు. తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేశారు.

‘‘ఏసియన్‌ పెయింట్స్‌, బెర్గర్‌ పెయింట్స్‌ లిమిటెడ్‌లకు టెండర్లు కట్టబెట్టడానికి వీలుగా నిబంధనలను రూపొందించారు. అయిదేళ్లలో ఏదైనా ఒక ఏడాది 131.50 లక్షల చదరపు మీటర్లు రంగులు వేసిన అనుభవం ఉండాలన్న టెండరు నిబంధనకు ప్రాతిపదిక లేదు. ఇంత పెద్దఎత్తున పెయింట్‌ సరఫరా అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఆ రెండు కంపెనీలకు మినహా మరే ఇతర బిడ్డర్లకు ఈ అర్హత ఉండదు. మేము కూడా మరో పెయింట్‌ తయారీ కంపెనీతో కలిసి సంయుక్తంగా టెండర్లలో పాల్గొనదలిచాం. ఇందుకోసం పెయింట్‌ తయారీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. ఇలాంటి టెండరు కేవలం ఏపీలో పిలవగా ఇవే కంపెనీలు దక్కించుకున్నాయి. షరతులపై   అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదు’’ అని పిటిషనర్‌ సంస్థ పేర్కొంది.

కమిటీ ఆమోదంతోనే టెండర్లు: ప్రభుత్వం

ఈ వాదనతో ప్రభుత్వం విభేదిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రూ.820 కోట్ల విలువతో 26,065 పాఠశాలలకు 495 లక్షల చదరపు మీటర్ల మేర రంగులు వేయాల్సి ఉందని తెలిపింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉందని పేర్కొంది. ‘‘మే 9న నోటిఫికేషన్‌ జారీచేశాక అదే నెల 17న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించాం. 9 సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో పిటిషనర్‌ కంపెనీ ప్రతినిధి ఎవరూ పాల్గొనలేదు. సమావేశానికి హాజరుకాకుండా, టెండరు వేయకుండా ఇక్కడ పిటిషన్‌ వేయడం సహేతుకం కాదు. టెండర్ల ప్రక్రియ కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. దాని ఆమోదంతోనే టెండర్లు పిలిచాం. టెక్నికల్‌ బిడ్‌ను తెరవగా.. హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా, మేఘా ఇంజినీరింగ్‌లు అర్హత సాధించాయి’’ అని ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులో మేఘా ఇంజినీరింగ్‌ సైతం కౌంటరు దాఖలు చేసింది. పిటిషనర్‌..   పెయింట్‌ తయారీదారుతో కుదుర్చుకున్న విషయాన్ని వెల్లడించలేదని తెలిపింది. హైకోర్టును ఆశ్రయించాక గోప్యత పాటిస్తాననడం సరికాదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని