తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తుల నియామకం

తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిలో నలుగురిని శాశ్వత న్యాయమూర్తులుగా, ఇద్దరిని అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

Updated : 13 Aug 2022 06:39 IST

కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం

ఈనాడు, దిల్లీ: తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిలో నలుగురిని శాశ్వత న్యాయమూర్తులుగా, ఇద్దరిని అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం జులై 25న న్యాయవాదుల కోటా కింద సిఫార్సు చేసిన ఈ ఆరుగురి నియామకాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124(1) కింద దఖలుపడిన అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, నగేష్‌ భీమపాక, పుల్లా కార్తీక్‌, కాజ శరత్‌లు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులుకాగా, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావులు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. వీరితోపాటు మరో 5 హైకోర్టులకు  20 మంది న్యాయమూర్తుల నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టుకు ఇద్దరు, ఒడిశా హైకోర్టుకు ఇద్దరు, గువాహటి హైకోర్టుకు ఇద్దరు, అలహాబాద్‌ హైకోర్టుకు 9 మంది, కర్ణాటక హైకోర్టుకు అయిదుగురు అదనపు న్యాయమూర్తులను నియమించారు. దీంతో మొత్తం 6 హైకోర్టులకు కలిపి ఒకేరోజు 26 మంది న్యాయమూర్తులను నియమించినట్లయింది. 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన తెలంగాణ హైకోర్టులో ఈనెల 1వ తేదీనాటికి 28 మంది సేవలందిస్తున్నారు. 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆరుగురి నియామకంతో ఖాళీ పోస్టులు 8కి తగ్గనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలు 379 నుంచి 353కి తగ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని