నాణ్యత నీటిపాలు

పదికాలాలపాటు ఆయకట్టుకు సాగునీరు.. సమీప గ్రామాలకు తాగునీరు అందించాల్సిన జలాశయం నిర్మాణ పనుల్లో నిండా నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. నల్గొండ జిల్లాలో ఆర్‌.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్

Published : 14 Aug 2022 05:16 IST

నిర్లక్ష్యంగా డిండి శివన్నగూడెం జలాశయం పనులు

నీళ్లు నిల్వ ఉండగానే సీవోటీ నిర్మాణం

భవిష్యత్తులో జలాశయం దిగువన బుంగలు, ఊట ఏర్పడే ప్రమాదం

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే-మర్రిగూడ: పదికాలాలపాటు ఆయకట్టుకు సాగునీరు.. సమీప గ్రామాలకు తాగునీరు అందించాల్సిన జలాశయం నిర్మాణ పనుల్లో నిండా నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. నల్గొండ జిల్లాలో ఆర్‌.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న శివన్నగూడెం జలాశయం పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఆనకట్ట భద్రతతో పాటు దిగువ ప్రాంతాల రక్షణకు కీలకమైన సీవోటీ(కట్‌ ఆఫ్‌ ట్రెంచ్‌) నిర్మాణం నీటిపారుదలశాఖ ఇంజినీర్ల పర్యవేక్షణ లోపం కారణంగా నీళ్లలో సాగుతోంది. కట్ట దిగువన తవ్విన సీవోటీ ట్రెంచ్‌లో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు చేరింది. దాన్ని పూర్తిస్థాయిలో తొలగించిన అనంతరం పనులు చేయాల్సి ఉండగా హడావిడిగా చేపడుతున్నారు.

ఏం జరుగుతోందంటే..

డిండి ఎత్తిపోతలలోని చివరి జలాశయం.. ‘శివన్నగూడెం’. నిల్వ సామర్థ్యం 11.96 టీఎంసీలు. మర్రిగూడ మండలం చెర్లగూడెం, శివన్నగూడెం గ్రామాల మధ్య ప్యాకేజీ 6, 7లలో భాగంగా రూ. 1,519 కోట్లతో ఈ జలాశయం పనులు చేపట్టారు. నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోని 10 మండలాల పరిధిలో 1.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. 2015లో మొదలైన పనులు నిర్వాసితుల అడ్డగింత తదితర కారణాలతో ఆగుతూ.. సాగుతున్నాయి. ప్రస్తుతం కట్ట పూర్తి కావచ్చింది. దాని లోపలివైపు సీవోటీ నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగా ట్రెంచ్‌ తవ్వారు. దాని అడుగుభాగం నుంచి నల్లమట్టి నింపుతూ వస్తున్నారు. వర్షాలతో ట్రెంచ్‌లో చేరిన నీటిని తొలగించకుండానే కొద్ది రోజులుగా పనులు చేస్తున్నారు. నీటి తోడివేతకు ఒకటీ రెండు మోటార్లను పేరుకే ఏర్పాటు చేశారు. నీళ్లలోనే మట్టి వేసి చదును చేస్తున్నారు. రోలర్లతో తొక్కించాల్సి ఉన్నా అలా చేయడం లేదు.

ఇలా చేయాలి..

జలాశయ నిర్మాణంలో సీవోటీ కీలకం. కట్ట ఎత్తు, నిల్వ సామర్థ్యాన్ని అనుసరించి.. దాని లోపలివైపు లోతు నుంచి మట్టి తవ్వాలి. కట్టను బలోపేతం చేస్తూ నిర్మించాలి. దాదాపు ప్రతి మీటరులోపే ఒక పొర మట్టి వేసి భారీ యంత్రాలతో(రోలర్లు) తొక్కించాలి. ప్రతి పొరకు సాంద్రత(డెన్సిటీ) 98 శాతం ఉండాలి. నీళ్లు అసలు ఉండకూడదు. మట్టిని రోలింగ్‌ చేసేందుకు మాత్రం కొంత తేమ ఉండేలా చూస్తారు. కానీ, శివన్నగూడెం పనులు నీటిలోనే జరుగుతున్నాయి. సీవోటీ బలహీనంగా ఉంటే మట్టి పొరల మధ్య ఖాళీలతో భవిష్యత్తులో కట్ట దిగువన లీకేజీలు, బుంగలు, ఊట లాంటివి ఏర్పడే ప్రమాదముంది.

‘నీరంతా వెళ్లిపోయాకే పనులు’

పనుల తీరుపై నీటిపారుదల శాఖ డిండి ఎత్తిపోతల కార్యనిర్వాహక ఇంజినీర్‌ రాములు నాయక్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా... ట్రెంచ్‌లో చేరిన నీటికి కట్టలు వేసి మోటార్లతో తోడుతున్నామని, నీరంతా వెళ్లిపోయాకే పనులు చేస్తున్నామని తెలిపారు. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, నీటిపారుదల శాఖ నాణ్యత పర్యవేక్షణ ఇంజినీర్లు పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని