నెమ్మదించిన రెవెన్యూ సేవలు

రెవెన్యూశాఖలో క్షేత్రస్థాయి సేవలు క్రమేపీ స్తంభిస్తున్నాయి. తహసీల్దారు కార్యాలయాల నుంచి జారీ కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు, భూ సంబంధిత విచారణ ప్రక్రియలు నత్తనడకన సాగుతున్నాయి.

Published : 17 Aug 2022 05:36 IST

 ధ్రువపత్రాలు.. సర్వే.. టీఎం-33 విచారణలకు ఆటంకం

ఈనాడు, హైదరాబాద్‌: రెవెన్యూశాఖలో క్షేత్రస్థాయి సేవలు క్రమేపీ స్తంభిస్తున్నాయి. తహసీల్దారు కార్యాలయాల నుంచి జారీ కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు, భూ సంబంధిత విచారణ ప్రక్రియలు నత్తనడకన సాగుతున్నాయి. ఓ వైపు గ్రామ రెవెన్యూ అధికారులను (వీఆర్వో) తొలగించడం, మరోవైపు గ్రామ రెవెన్యూ సహాయకులు సమ్మెలో ఉండడంతో సేవలు ఆగిపోయాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్‌లకు సంబంధించిన గ్రామస్థాయి విచారణలు ముందుకు కదలడం లేదు. మీ-సేవ ద్వారా యువత, విద్యార్థులు చేసుకుంటున్న వివిధ రకాల దరఖాస్తులు ఒక్కో మండలంలో కనీసం 200కి పైగా అపరిష్కృతంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 594 మండలాల్లోని తహసిల్దారు కార్యాలయాల్లో గిర్దావర్‌లు (ఆర్‌ఐలు) అన్నీ తామై విచారణ చేపడుతున్నారు. గ్రామస్థాయిలో వీఆర్‌వో లేదా వీఆర్‌ఏ ఇచ్చే సమాచారం ఆధారంగా ఆర్‌ఐలు నోట్‌ ఫైల్‌ రూపొందించి తహసీల్దారుకు నివేదిక ఇస్తేనే ధ్రువీకరణ పత్రం జారీ ప్రక్రియ పట్టాలకు ఎక్కుతుంది. ఇప్పుడు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించేందుకు సహాయకులు ఎవరూ లేకపోవడంతో ఆర్‌ఐలు అత్యవసరం ఉన్న పనులను చేస్తున్నారు. వీఆర్‌ఓలను తొలగించడం, వీఆర్‌ఏలు విధులకు దూరంగా ఉండటంతో సేవలకు కలుగుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, ఏఎస్‌ఓలు జిల్లా కలెక్టర్లను కోరుతున్నారు.

తలనొప్పిగా ధరణి సమస్యలు

* భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూశాఖ మీసేవ కేంద్రాల ద్వారా టీఎం-33 మాడ్యూల్‌ కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో కుప్పలుగా దరఖాస్తులు వస్తున్నాయి. వాటి పరిష్కారానికి 1954-55 నుంచి ఖాస్రా పహాణీ పత్రాలు పరిశీలించాల్సి వస్తోంది. వాటిని తెరవడం, పరిశీలించడం, నకలు పత్రాలు తీసుకోవడం కూడా ఆర్‌ఐలే చేస్తున్నారు.

* మీ సేవ ద్వారా దాఖలవుతున్న సర్వేకు సంబంధించి 5వేలకు పైగా దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉండగా సహాయ సిబ్బంది లేక పక్కన పెట్టినట్లు సమాచారం. 

* మండల స్థాయిలో ఉండే సహాయ గణాంక అధికారులు (ఏఎస్‌ఓ) సరైన సమాచారం అందక ఇబ్బంది పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని