విద్యావేత్త గుజ్జుల నర్సయ్య మృతి

ప్రముఖ విద్యావేత్త, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఆచార్యులు గుజ్జుల నర్సయ్య(81) శనివారం హనుమకొండలోని తన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

Published : 25 Sep 2022 04:47 IST

సుబేదారి, న్యూస్‌టుడే, ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ విద్యావేత్త, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఆచార్యులు గుజ్జుల నర్సయ్య(81) శనివారం హనుమకొండలోని తన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. 1952లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో ఆయన స్వయంసేవక్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు. 1967లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ కార్యకర్తగా చేరారు. 1981లో ఆంగ్ల ఉపన్యాసకుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1986లో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థి సంఘాలతో అనేక పోరాటాలు చేశారు. 1992లో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరించారు. బిహార్‌ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి సభ్యుడిగానూ పనిచేశారు. 2001లో హనుమకొండ కాకతీయ డిగ్రీ కళాశాలలో పదవీ విరమణ పొందారు. 2007లో నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గుజ్జుల నర్సయ్య జాతీయవాద భావాలతో దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ సభల్లో అనర్గళంగా మాట్లాడేవారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. నర్సయ్య మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, నాయకులు ఈటల, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం జాతీయవాదులకు తీరని లోటని పేర్కొంటూ ఆరు దశాబ్దాల పాటు విద్యారంగానికి, విద్యార్థులకు చేసిన సేవలను కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు