మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయానికి ఆఫ్‌గ్రిడ్‌ సౌరవిద్యుత్‌

కరెంటు లైన్లు లేని మారుమూల ప్రాంతాల వ్యవసాయ బోర్లకు నేరుగా సౌరవిద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కేంద్రం తాజాగా అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ బోర్ల వద్ద ఏర్పాటుచేసే

Published : 26 Sep 2022 04:10 IST

విద్యుత్తు లైన్ల ఖర్చు ఆదాకు కేంద్రం సూచన

30 శాతం రాయితీ రాష్ట్రం భరించాలని షరతు

ఈనాడు, హైదరాబాద్‌: కరెంటు లైన్లు లేని మారుమూల ప్రాంతాల వ్యవసాయ బోర్లకు నేరుగా సౌరవిద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కేంద్రం తాజాగా అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ బోర్ల వద్ద ఏర్పాటుచేసే సౌరఫలకాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కరెంటు లైన్లకు కలపరు. దీనిని ఆఫ్‌గ్రిడ్‌ విధానమని పిలుస్తారు. అక్కడ ఉత్పత్తయ్యే సౌరవిద్యుత్‌ను అదే వ్యవసాయ బోరు మోటారుకు  వినియోగిస్తారు. దీనివల్ల అటవీ, మారుమూల గ్రామాల్లోని పొలాల వద్దకు సాధారణ కరెంటు లైన్లు వేయడానికి ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల ఏర్పాటు, తీగలు లాగేందుకు ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం)లు  వెచ్చిస్తున్న రూ.వందల కోట్ల సొమ్ము ఆదా అవుతుందని కేంద్ర విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా తొలుత 400 వ్యవసాయ బోర్లకు ఆఫ్‌గ్రిడ్‌ సౌరవిద్యుత్‌ ఏర్పాటుచేయాలని నిధులు మంజూరుచేసింది. ఉదాహరణకు ఒక రైతు పొలంలో వ్యవసాయ బోరుకు 5 అశ్వికశక్తి(హెచ్‌పీ) కరెంటు మోటారు పెడితే దానిని నడపటానికి 7 కిలోవాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేసే ఫలకాల ఏర్పాటుకు రూ.3.50లక్షల వరకూ ఖర్చవుతుంది. ఇందులో 30 శాతం రాయితీగా భరిస్తామని కేంద్రం నిధులు మంజూరుచేసింది. కానీ, ఇవి రావాలంటే మరో 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం తప్పక భరించాలనే షరతు పెట్టింది. మిగిలిన 40 శాతం సొమ్మును రైతు పెట్టుకుంటే సరి లేదా డిస్కం భరించాలి. సాధారణ కరెంటు వ్యవసాయ కనెక్షన్‌ ఇవ్వడానికి డిస్కం ప్రస్తుతం రూ.70వేలను భరిస్తున్నందున దానికి మరికొంత కలిపి ఇస్తే అదే బోరుకు ఆఫ్‌గ్రిడ్‌ సౌరవిద్యుత్‌ ఏర్పాటుచేయవచ్చని తెలిపింది. దీనివల్ల రైతులపై భారం పడకుండానే సౌరవిద్యుత్‌ ఏర్పాటు సాధ్యమవుతుంది. తెలంగాణలో ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 26.96 లక్షలకు చేరాయి. వీటికి 24 గంటలూ ఉచితంగా కరెంటు ఇస్తున్నందున ఏడేళ్లలో రాయితీగా రూ.36,890 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఆఫ్‌గ్రిడ్‌ సౌరవిద్యుత్‌ ఏర్పాటు ద్వారా మారుమూల ప్రాంతాల్లో మాత్రం వ్యవసాయ బోర్లకు ఉచితంగా ఎలాంటి ఖర్చు లేకుండా విద్యుత్‌ సరఫరా సాధ్యమవుతుందని కేంద్రం అన్ని రాష్ట్రాలకు తెలిపింది.

ప్రతిపాదనలు పంపాం..
రాష్ట్రంలో 400 బోర్లకు వచ్చే మార్చిలోగా ఆఫ్‌గ్రిడ్‌ సౌరవిద్యుత్‌ ఏర్పాటుకు కేంద్రం అనుమతించిన మాట వాస్తవమేనని, 30 శాతం రాయితీ భరించడానికి నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఎండీ జానయ్య ‘ఈనాడు’కు చెప్పారు. అటవీప్రాంతాల్లో వ్యవసాయ బోర్లకు సాధారణ కరెంటు సరఫరాకు లైన్లు, స్తంభాల ఏర్పాటుకు అటవీశాఖ అనుమతులు లభించడం కష్టంగా ఉన్నందున.. గిరిజన రైతుల బోర్లకు వీటి ఏర్పాటును పరిశీలించాలని గిరిజన సంక్షేమశాఖను కోరినట్లు ఆయన వివరించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని