తెలంగాణ జాతికి గర్వకారణం ఐలమ్మ: మంత్రి గంగుల

చాకలి ఐలమ్మ ఒక కులానికి పరిమితమైన వ్యక్తి కాదని, తెలంగాణ జాతికి గర్వకారణమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సోమవారం చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాన్ని

Published : 27 Sep 2022 04:53 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: చాకలి ఐలమ్మ ఒక కులానికి పరిమితమైన వ్యక్తి కాదని, తెలంగాణ జాతికి గర్వకారణమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సోమవారం చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాన్ని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. నాడు వివక్షను ఎదిరించి ఆత్మగౌరవం కోసం నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె స్ఫూర్తితో కేసీఆర్‌ రాష్ట్ర సాధన కోసం పోరాడారన్నారు. నాటి పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురవుతున్న బలహీనవర్గాలకు సీఎం నేతృత్వంలో ఆత్మగౌరవం వెల్లివిరిస్తోందన్నారు. రజకులకు, నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత కరెంట్‌ ప్రభుత్వం అందిస్తోందని దాదాపు లక్ష కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు. ఆత్మగౌరవ భవన నిర్మాణానికి మేడిపల్లిలో రెండెకరాల స్థలం, రూ.5 కోట్లు కేటాయించినట్లు వివరించారు. సంచార జాతులతో పాటు బీసీ కులాలకు 87 ఎకరాల భూమి, రూ.95 కోట్లు ముఖ్యమంత్రి ఇచ్చారని తెలిపారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని మాట్లాడుతూ వెట్టిచాకిరీ విముక్తి కోసం దొరలు, రజాకార్లపై తిరుగుబాటు చేసి కొట్లాడిన వీరనారి ఐలమ్మ అని కీర్తించారు. కేసీఆర్‌కు తెలంగాణ ఎలా ఉండాలో ఒక విజన్‌ ఉందని, అందుకు అనుగుణంగానే నిరంతరం పనిచేస్తుంటారన్నారు. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ తాను ఉమ్మడి రాష్ట్రంలో బీసీ సంక్షేమ మంత్రిగా చేయలేని పనులెన్నో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో దిగ్విజయంగా పూర్తి చేస్తున్నామన్నారు. బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, బీసీ కమిషన్‌ సభ్యులు ఉపేందర్‌, కిశోర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని