కస్సు.. బస్సు...

దసరా వేళ ప్రైవేటు బస్సుల నిర్వాహకులు అధిక ఛార్జీలతో  బెంబేలెత్తిస్తున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు  ప్రయాణ ఛార్జీలను ఇష్టారాజ్యంగా పెంచేశారు.

Published : 29 Sep 2022 04:34 IST

పండగ వేళ ఇష్టారాజ్యంగా ప్రైవేటు బస్సుల ఛార్జీలు

రెండింతలకుపైగా పెంపు.. ప్రయాణికులకు భారం

ఈనాడు, హైదరాబాద్‌: దసరా వేళ ప్రైవేటు బస్సుల నిర్వాహకులు అధిక ఛార్జీలతో  బెంబేలెత్తిస్తున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు  ప్రయాణ ఛార్జీలను ఇష్టారాజ్యంగా పెంచేశారు. ఆర్టీసీతో పోలిస్తే రెండు నుంచి మూడింతల ఛార్జీలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండగ తేదీ సమీపించేకొద్దీ ఆ ధరలు మరింత పెరిగే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతితోపాటు బెంగళూరు మార్గాల్లో పండగల రోజుల్లో రద్దీ అధికంగా ఉంటుంది. ఛార్జీల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకపోవటం ప్రైవేటు ఆపరేటర్లకు కలిసివస్తోంది. పండగల సందర్భంగా సాధారణ ఛార్జీలపై 50 శాతాన్ని అదనంగా వసూలు చేయవచ్చు అంటూ గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కొంతకాలంగా అమలులో ఉంది. టీఎస్‌ఆర్టీసీ కూడా అదనపు ఛార్జీలను వసూలు చేసినా.. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆ సంస్థ గతేడాదిగా పలు ప్రయోగాలు చేస్తోంది. కొన్ని సందర్భాల్లో అదనపు ఛార్జీ వసూలు చేసింది. ఆ తర్వాత మళ్లీ రద్దు చేసింది. ఇలా వివిధ రకాల ప్రయోగాలతో ఆక్యుపెన్సీ పెద్దగా పెరగలేదని, అదనపు ఆదాయం కొంత తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా దసరా సందర్భంగా అదనపు ఛార్జీలను వసూలు చేయొద్దని ఆర్టీసీ నిర్ణయించింది. ఏపీఎస్‌ఆర్టీసీ కూడా తెలంగాణ మాదిరే అదనపు వడ్డనకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ప్రైవేటు బస్సులు ఛార్జీలను భారీగా పెంచిన కారణంగా ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగి సంస్థకు ఆదాయం సమకూరుతుందని టీఎస్‌ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.

1వ తేదీ నుంచి రద్దీ
అక్టోబరు 1వ తేదీ (శనివారం) నుంచి దసరా ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దసరా పండగ 5వ తేదీన ఉంది. ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం కలిసి రావటంతో అక్టోబరు 10 వరకు రద్దీ ఉంటుందని చెబుతున్నారు. పండగ సందర్భంగా 4,195 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు