ఊరూ వాడా.. ఉయ్యాలో ఉయ్యాలో

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా ముగిశాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్‌ మహానగరం మొదలుకొని ఊరూ..వాడా ఉయ్యాల పాటలు మారుమోగాయి.

Updated : 04 Oct 2022 05:35 IST

రాష్ట్రమంతటా వైభవంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు

రాజధానిలో అంబరాన్నంటిన సంబరాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పూల పండుగ బతుకమ్మ వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా ముగిశాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్‌ మహానగరం మొదలుకొని ఊరూ..వాడా ఉయ్యాల పాటలు మారుమోగాయి. పోయి రా బతుకమ్మ.. పోయి రావమ్మా... అని పాడుతూ మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేశారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఉత్సవాలను కన్నులపండువగా నిర్వహించారు. ఎల్బీ స్టేడియంలో నాలుగువేల బతుకమ్మలను పేర్చి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, కార్పొరేషన్ల ఛైర్మన్లు జూలూరు గౌరీశంకర్‌, దీపికారెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు పూజలు నిర్వహించి బతుకమ్మల భారీ ప్రదర్శనను ప్రారంభించారు. ఎల్బీ స్టేడియం నుంచి మహిళలు బతుకమ్మలను ఎత్తుకుని ప్రదర్శనగా ట్యాంక్‌బండ్‌ చేరుకున్నారు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆమె ఆడిపాడారు. నెక్లెస్‌రోడ్‌లోని కర్బలా మైదానంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. దసరాను పురస్కరించుకొని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సోమవారం రాజ్‌భవన్‌లో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. 

జిల్లాల్లో..

హనుమకొండ జిల్లా కేంద్రంలోని పద్మాక్షి ఆలయం సమీపంలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడలో, వరంగల్‌ ఉర్సుగుట్ట వద్ద రంగలీలా మైదానంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహిళలతో కలిసి బతుకమ్మ ర్యాలీలో పాల్గొన్నారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌  పాల్గొన్నారు. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌లోనూ ఉత్సాహంగా మహిళలు సద్దుల బతుకమ్మ పండుగ జరిపారు. 

బతుకమ్మ సంబురాలు చేసుకోవడం ఆనందంగా ఉంది: గవర్నర్‌

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: మహిళలతో కలిసి బతుకమ్మ సంబురాలు చేసుకోవడం ఆనందంగా ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి కేబీఎన్‌ చౌరస్తా వద్ద అక్షర స్ఫూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వైభవంగా సద్దుల బతుకమ్మ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ఎంతో గొప్పదన్నారు. తొమ్మిదేళ్లుగా ఈ ప్రాంతంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఎంపీ డా.కె.లక్ష్మణ్‌ తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts