‘స్వచ్ఛ’ పురపాలికలకు రూ.రెండేసి కోట్లు

తెలంగాణలో పరిపాలన ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

Updated : 05 Oct 2022 05:51 IST

పాలనలో దిక్సూచిగా మారిన తెలంగాణ
అభినందన కార్యక్రమంలో మంత్రి కె.టి.రామారావు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పరిపాలన ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వచ్చే అయిదేళ్లలో పట్టణ జనాభా 50 శాతానికి మించుతుందని, దీనికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ ఏడాది స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డులు అందుకున్న 19 పురపాలికలు, నగరపాలక సంస్థల ఛైర్‌పర్సన్‌లు, మేయర్లు, కమిషనర్లు, డిప్యూటీ ఛైర్‌పర్సన్లు, డిప్యూటీ మేయర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల అభినందన కార్యక్రమాన్ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇందులో మంత్రి కేటీఆర్‌ పాల్గొని అవార్డులు పొందిన వారిని సన్మానించి, అభినందించారు. అవార్డులు సాధించిడానికి దోహదపడిన పురపాలకశాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ బృందాన్ని ప్రశంసించారు. స్వచ్ఛత అవార్డులు సాధించిన పురపాలికలకు రూ.2 కోట్ల చొప్పున ప్రోత్సాహకం అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దేశంలో మెరుగైన పాలన అందిస్తున్న పురపాలికలను అధ్యయనం చేయడానికి వెళ్లేందుకు ఈ పురపాలికల ప్రజాప్రతినిధులు, అధికారులకు అవకాశం కల్పిస్తామన్నారు.ఎంపిక చేసిన పదిమందిని జపాన్‌, సింగపూర్‌లలో పట్టణాభివృద్ధిని పరిశీలించేందుకు పంపించనున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ పురపాలక అవార్డుల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌ దార్శనికతతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. స్పష్టమైన సంకల్పం, ప్రణాళికతో ముందుకు సాగడం వల్లే రాష్ట్రానికి గ్రామీణ, పట్టణ స్వచ్ఛత అవార్డులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, పురపాలకశాఖ శాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వార్డు ఆఫీసర్లను నియమిస్తాం

కేంద్రం అవార్డులు, కితాబులు ఇస్తుండగా మరోవైపు అక్కడున్న వారే రాష్ట్రంలో పాలన పడకేసిందని, అస్తవ్యస్తంగా ఉందని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పట్టణ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, పర్యావరణం వంటి అంశాలపై ప్రత్యేకదృష్టి అవసరమన్నారు. నిర్దేశించుకున్న కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు.

రాష్ట్రంలో ఏ పురపాలికలో కూడా పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.12 వేలకంటే తక్కువ జీతం ఇవ్వకూడదని మంత్రి స్పష్టం చేశారు.వారికి భద్రత పరికరాలను విధిగా ఇవ్వాలన్నారు.సిరిసిల్లలో పొడి చెత్తను రీసైకిల్‌ చేసి అమ్మడం ద్వారా నెలకు రూ 8.35 లక్షల అదనపు ఆదాయం పొందుతున్నారని, దీన్ని ఇతర పురపాలికలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆస్కి ఆధ్వర్యంలో 20 స్టార్టప్‌లను పురపాలికలతో అనుసంధానం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  పురపాలికల్లో 3712 మంది వార్డు ఆఫీసర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. పురపాలకశాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ జరుగుతోందని, స్థానిక సంస్థలకు ప్రత్యేక అదనపు కలెక్టర్లను నియమించిన ఘనత తెలంగాణదే అని అన్నారు. రాష్ట్రానికి ఎన్జీటీ జరిమానాపై మాట్లాడుతూ.. మురుగునీటి శుద్ధి సహా వివిధ అంశాలపై సమాచార లోపంతోనే ఇలా జరిగిందని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ వివరించారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ అంశాలను ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts