యాదాద్రి విద్యుత్తు కేంద్రం పర్యావరణ అనుమతిపై మళ్లీ అధ్యయనం

యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్యావరణ అనుమతిపై మరోసారి అధ్యయనం చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ), చెన్నై శాఖ ఆదేశాలు జారీచేసింది.

Published : 07 Oct 2022 04:54 IST

తొమ్మిది నెలల్లో పూర్తిచేయాలి

అప్పటివరకూ భారీ యంత్రాల అమరిక, విద్యుదుత్పత్తి వద్దు

చెన్నై ఎన్జీటీ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్యావరణ అనుమతిపై మరోసారి అధ్యయనం చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ), చెన్నై శాఖ ఆదేశాలు జారీచేసింది. తొమ్మిది నెలల్లో నివేదిక పూర్తిచేసి ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖను ఆదేశించింది. అప్పటివరకు కేంద్రం ఇచ్చిన అనుమతిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ లోపు ప్లాంటు సాధారణ నిర్మాణాలు చేపట్టవచ్చంది. భారీ యంత్రాలు అమర్చకూడదని, నిర్మాణం పూర్తయినా విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించకూడదని ఆదేశాలిచ్చింది.

ముంబయికి చెందిన ది కన్జర్వేషన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ట్రస్టు అనే సంస్థ ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర అటవీశాఖకు కొన్ని సూచనలు చేసింది. భవిష్యత్తులో థర్మల్‌, అణు విద్యుత్తు ప్లాంట్లు, ప్రమాదకారక (రెడ్‌ కేటగిరీ) పరిశ్రమల కోసం అటవీ భూములను ఇవ్వకూడదంది. యాదాద్రి ప్లాంటు ప్రదేశాల్లో రేడియోధార్మిక ఉద్గారాల స్థాయి, బూడిద కుంటల నిర్మాణం, డిజైన్‌, నిర్వహణ, ప్రాజెక్టుకు 25 కి.మీ చుట్టూ గాలిలో నాణ్యత, దాని ప్రభావం వంటి అంశాలపై అధ్యయనం చేయాలని వెల్లడించింది. ప్రాజెక్టు ప్రాంతం నుంచి అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ప్రాంత సరిహద్దు ఎంత దూరంలో ఉందనే విషయమై కచ్చితమైన సమాచారం ఇవ్వాలని కోరింది. ఈ ప్రక్రియ జెన్‌కో, నిపుణుల అప్రైజల్‌ కమిటీ (ఈఏసీ), కేంద్ర పర్యావరణశాఖ తొమ్మిది నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. ఎన్జీటీ సూచించిన ఆయా అంశాలపై అధ్యయనం తరువాత, కేంద్ర పర్యావరణశాఖ ఆదేశాలు, నివేదిక మేరకు తదుపరి అనుమతులు ఉంటాయని తేల్చిచెప్పింది.


ప్లాంటు నిర్మాణం కొనసాగుతుంది
- ప్రభాకరరావు, సీఎండీ, జెన్‌కో

తెలంగాణ ప్రభుత్వానికి, జెన్‌కోకు ఎన్జీటీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కేంద్ర అటవీశాఖకు సూచనలు చేసింది. థర్మల్‌ ప్లాంటుకు 10కి.మీ దూరంలో రక్షిత అటవీ ప్రాంతం ఉంటే ఈ నిబంధనలు వర్తిస్తాయి. యాదాద్రి పవర్‌ ప్లాంటుకు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ప్రాంతం 10 కి.మీ అవతల ఉందని కేంద్ర అటవీశాఖ స్పష్టంగా వెల్లడించింది. నిర్మాణ పనులు ప్రారంభానికి ముందే కేంద్ర పర్యావరణ అనుమతి లభించింది. దానికి సూచనలు (టీవోఆర్‌)జారీ చేస్తూ.. మరోసారి అధ్యయనం చేయాలన్న ఆదేశాలు..తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయి. ప్లాంటుకు టైగర్‌ రిజర్వు దగ్గర్లో లేనందున, ఎన్జీటీ ఉత్తర్వుల ప్రభావం ఉండబోదు. యాదాద్రి థర్మల్‌ కేంద్రం నిర్మాణాన్ని కొనసాగిస్తాం.


ఆపేందుకు కుట్ర
- మంత్రి జగదీశ్‌రెడ్డి

అన్ని చట్టాలకు లోబడే పవర్‌ప్లాంట్‌ నిర్మాణం జరుగుతోంది. దాన్ని ఆపేందుకు అదృశ్య శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. ఎన్జీటీ తీర్పు ఏకపక్షంగా, దేశానికి నష్టం కలిగించేలా ఉంది. నిర్మాణం ఆపాలంటూ లేవనెత్తిన అంశాలన్నీ పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయి. ముంబయి సంస్థకు యాదాద్రి ప్లాంట్‌తో సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు. రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టాక వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం సరైంది కాదు. గతంలో ఇదే సంస్థ కేసు వేసినప్పుడు ఎన్జీటీ కొట్టివేసింది. తాజా తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేస్తాం. అనుకున్న సమయానికి ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని