సోమశిల వద్ద కృష్ణాపై వంతెనకు కేంద్రం సై..

ఎట్టకేలకు 15 ఏళ్ల చిరకాల స్వప్నం సాకారం కానుంది. ఆ రెండు ప్రాంతాల ఆశలకు మోక్షం లభించనుంది.

Updated : 08 Oct 2022 06:07 IST

నిర్మాణ వ్యయం రూ.1,100 కోట్లుగా అంచనా
ఆమోదం తెలిపిన జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: ఎట్టకేలకు 15 ఏళ్ల చిరకాల స్వప్నం సాకారం కానుంది. ఆ రెండు ప్రాంతాల ఆశలకు మోక్షం లభించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సోమశిల వద్ద కృష్ణానదిపై అత్యాధునిక సస్పెన్షన్‌ తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. తెలంగాణలోని కొల్లాపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి రాకపోకలు సాగించాలంటే కృష్ణానదిలో పడవ ప్రయాణమే శరణ్యం. రెండు రాష్ట్రాల మధ్య రహదారి మార్గంలో రాకపోకలు సాగించాలంటే సుమారు వంద కిలోమీటరు చుట్టుతిరిగి రావాల్సిందే. మున్ముందు ఆ కష్టాలకు తెరపడనుంది. 2007లో కృష్ణానదిలో పడవ మునగటంతో 61 మంది జలసమాధి అయ్యారు. అప్పటి నుంచి నదిపై వంతెన నిర్మించాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు. అధికారులు ప్రతిపాదనలు రూపొందించినా కాగితాలు దాటలేదు. ఈ క్రమంలో కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ భారత్‌మాల పరియోజన పథకం పరిధిలో వారధి నిర్మాణాన్ని ప్రతిపాదించటంతో ఆశలు మళ్లీ చిగురించాయి.

రూ.1,100కోట్లతో ఆధునికంగా..

తెలంగాణలోని కొల్లాపూర్‌ సమీప సోమశిల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం నియోజకవర్గం కొత్తపల్లి మండలం సిద్ధేశ్వరం వరకు సుమారు 3కి.మీ. వంతెనను నిర్మించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ పరిధిలోని స్టాండింగ్‌ ఫైనాన్స్‌ కమిటీ(ఎస్‌ఎఫ్‌సీ) సమావేశం గురువారం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వంతెన నిర్మాణానికి ఆమోదాన్ని తెలుపుతూ నిర్ణయించింది. సుమారు రూ.1,100 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. పర్యాటకాభివృద్ధికి అనువుగా నదిపై నాలుగు వరుసల్లో సస్పెన్షన్‌ వైర్‌ బ్రిడ్జిని నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వంతెనకు అనుసంధానంగా తెలంగాణలోని కల్వకుర్తి-నాగర్‌కర్నూల్‌-కొల్లాపూర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూర్‌-నంద్యాల మార్గాన్ని కేంద్రం ఇప్పటికే జాతీయ రహదారిగా గుర్తించింది. రెండు రాష్ట్రాల్లో కలిపి 170 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారి నిర్మాణానికి నెలాఖరుకల్లా గుత్తేదారును కేంద్రం ఖరారు చేయనుంది. ఈ ఏడాది చివరికి రహదారి విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వైపు ప్రయాణించేవారికి కర్నూలు మీదుగా చుట్టుతిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లేవారికైతే సుమారు 90కి.మీ. దూరం తగ్గుతుంది.

మరో మూడింటికీ ఆమోదం

ఎస్‌ఎఫ్‌సీ సమావేశంలో తెలంగాణకు చెందిన మరో మూడు రహదారుల విస్తరణకూ కేంద్రం శుక్రవారం ఆమోదం తెలిపింది. 133 కిలోమీటర్ల నిడివిగల వాటి నిర్మాణానికి రూ.1,437 కోట్లు మంజూరు చేసింది. ఆదిలాబాద్‌ నుంచి బేల వరకు 33కి.మీ. రహదారి నిర్మాణానికి రూ.491కోట్లు, ఖమ్మం నుంచి కురవి వరకు 38కి.మీ. రహదారికి రూ.446 కోట్లు, ఎల్లారెడ్డి నుంచి రుద్రూరు వరకు 52 కిలోమీటర్ల మార్గానికి రూ.500 కోట్లు మంజూరు చేసింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని