త్వరలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు!

రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్లు సహా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు భారీఎత్తున జరగనున్నాయి.

Updated : 29 Nov 2022 06:01 IST

పలువురు సీనియర్‌ అధికారులు, కలెక్టర్లకు స్థానచలనం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్లు సహా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు భారీఎత్తున జరగనున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో పాలనను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కసరత్తు చేపట్టారు. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం పెద్దఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఆ తర్వాత అడపాదడపా కొన్ని బదిలీలు జరిగాయి. పలువురు అధికారులు దీర్ఘకాలికంగా ఒకే శాఖలో పనిచేస్తున్నారు. వారిలో కొందరు అదనంగా ఇతర శాఖల విధులను నిర్వర్తిస్తున్నారు. కొన్ని శాఖలకు కార్యదర్శులు, కమిషనర్లు, సంచాలకులు లేరు. నాలుగు జిల్లాలకు కలెక్టర్లు లేరు. పలు శాఖల్లో పూర్తిస్థాయి అధికారులు లేరు. కొందరు ఐఏఎస్‌ల పనితీరుపై మంత్రులు, ఉన్నతాధికారుల్లో అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు చురుకైన కలెక్టర్లు ఉండేలా..అన్ని ప్రధాన శాఖలకు అధికారులు ఉండేలా బదిలీలు చేపట్టాలని సీఎం యోచిస్తున్నారు. దీని కోసం విస్తృతస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వపరమైన అవసరాలపైనా సీఎం దృష్టి సారించారు. రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారులు పనిచేస్తున్న కాలం, పనితీరు, వివిధ శాఖల్లో ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సీఎంకు అందజేశారు. వీటన్నింటి విశ్లేషణ అనంతరం బదిలీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎస్‌లకూ..

ఐపీఎస్‌లలో డైరెక్టర్‌ జనరల్‌ స్థాయిలో బదిలీలకు అవకాశం ఉంది. వచ్చే నెలాఖరుకు డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో డీజీ స్థాయిలో పదోన్నతులకు సీఎం కసరత్తు చేస్తున్నారు.

రెవెన్యూయేతర అధికారులకు ఐఏఎస్‌గా పదోన్నతులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూయేతర శాఖల అధికారులకు ఐఏఎస్‌ పదోన్నతులకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అయిదు పదోన్నతి (కన్‌ఫర్డ్‌) పోస్టులకు వచ్చే నెల 3లోగా దరఖాస్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులకు అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. రెవెన్యూ, రెవెన్యూయేతర కేటగిరీల్లోని రాష్ట్ర అధికారులకు ప్రభుత్వం పదోన్నతుల ద్వారా ఐఏఎస్‌ హోదా కల్పిస్తుంది. రెవెన్యూ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారులకు సీనియారిటీ ద్వారా నేరుగా ఐఏఎస్‌ పదోన్నతులు దక్కుతున్నాయి. రెవెన్యూయేతర విభాగంలో మాత్రం.. శాఖల అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి, ఒక్కో పోస్టుకు అయిదుగురి పేర్లతో జాబితాను రూపొందిస్తారు. వారికి దిల్లీలో యూపీఎస్సీ కమిటీలో ఇంటర్వ్యూలు నిర్వహించి పదోన్నతులు కల్పిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెవెన్యూయేతర కేటగిరిలో ఇప్పటి వరకు ఐఏఎస్‌ పదోన్నతులు దక్కలేదు. పోస్టులు లేవనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిని చేపట్టలేదు. తాజాగా అయిదు ఖాళీలు తేలడంతో వీటిని రెవెన్యూయేతర కేటగిరిలో భర్తీ చేయాలని నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని