సమర్థత... సాధికారతే పంచాయతీలకు ప్రాణం

అట్టడుగు స్థాయిలో ప్రజలకు చేరువలో ఉన్న స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీలే ప్రజాపాలనలో అత్యంత కీలక విభాగాలని 15వ ఆర్థిక సంఘం సభ్యుడు, ఆర్థికవేత్త అశోక్‌ లాహిరి పేర్కొన్నారు.

Published : 30 Nov 2022 03:43 IST

15వ ఆర్థిక సంఘం సభ్యుడు అశోక్‌ లాహిరి
రాష్ట్ర ఆర్థిక సంఘాల జాతీయ సదస్సు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: అట్టడుగు స్థాయిలో ప్రజలకు చేరువలో ఉన్న స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీలే ప్రజాపాలనలో అత్యంత కీలక విభాగాలని 15వ ఆర్థిక సంఘం సభ్యుడు, ఆర్థికవేత్త అశోక్‌ లాహిరి పేర్కొన్నారు. అవి సమర్థంగా పనిచేసేలా చేయడంతోపాటు పూర్తి సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)లో మంగళవారం ప్రారంభమైన రాష్ట్ర ఆర్థిక సంఘాల జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అశోక్‌ మాట్లాడుతూ.. పంచాయతీలకు ఆర్థికంగా తోడ్పాటును అందించేందుకు 15వ ఆర్థిక సంఘం కీలక సిఫార్సులు చేసిందన్నారు. వాటికి నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని.. ఇదే పంథాను ఉత్తరాదిలోనూ అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక సంఘాల ఏర్పాటులో ఉదాసీనత ఎంతమాత్రం సరికాదన్నారు. ఇప్పటి వరకు కేవలం తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే వాటిని ఏర్పాటు చేశాయని వెల్లడించారు.

పనులకు నిధులతో ముడిపెట్టడంతో సత్ఫలితాలు.. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి: ఈ-గ్రామ స్వరాజ్‌, స్వామిత్వ పథకాల అమలుతో పటిష్ఠమైన ఆడిట్‌ విధానాలను అనుసరించడం ద్వారా పంచాయతీల ఆర్థిక బలోపేతం, జవాబుదారీతనంపై దృష్టిసారించామని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సంఘాలు పంచాయతీరాజ్‌ సంస్థల బలోపేతంలో కీలకమని.. వీటిని గడువులోపు నియమించి నివేదికలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిఫార్సులు, కేంద్ర మార్గదర్శకాలు అమలుచేస్తేనే నిధులు వస్తాయన్న నిబంధనతో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఎస్‌ఎఫ్‌సీలు ఏర్పాటు చేయకుంటే 2024-25, 2025-26లలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రాలకు విడుదల కావని గుర్తించాలన్నారు. ఈ సదస్సులో ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ నరేంద్ర కుమార్‌, కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అదనపు కార్యదర్శి సి.ఎస్‌.కుమార్‌, మాజీ కార్యదర్శి విజయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని