Kalvakuntla kavitha: నేడు కవిత ఇంటికి సీబీఐ

దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఇప్పటికే సీబీఐ సమాచారం అందించింది.

Updated : 11 Dec 2022 07:27 IST

దిల్లీ మద్యం కేసులో వాంగ్మూలం నమోదు
సీఎంతో కవిత భేటీ
కార్యకర్తలెవరూ ఇంటికి రావద్దని సూచన

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఇప్పటికే సీబీఐ సమాచారం అందించింది. కవిత విచారణ కోసం ఆరో తేదీని సూచిస్తూ సీబీఐ మొదట లేఖ రాయగా... ఆ రోజు తనకు ఇతర కార్యక్రమాలున్నాయని 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని ఆమె ప్రత్యుత్తరం రాశారు. దీంతో సీబీఐ ఆదివారం విచారిస్తామని సమాచారం ఇవ్వగా, కవిత అంగీకరించారు. ఈ నేపథ్యంలో కవిత శనివారం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత ఆమెతో సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజకీయకక్షతో ఇబ్బందులు పెట్టేందుకు భాజపా ఎన్ని ప్రయత్నాలు చేసినా... అవి ఫలించవని, సీబీఐ విచారణ దానిలో భాగమేనని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. సీబీఐకి ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించినట్లు తెలిసింది. ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ తమ ఇంటికి రావద్దని కవిత వారిని కోరినట్లు తెలుస్తోంది. ఆమె ఇంటిమార్గంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. కవిత నివాసం వద్ద భారాస నేతలు భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌.. విల్‌ నెవర్‌ ఫియర్‌ (యోధుని కుమార్తె..ఎన్నటికీ భయపడదు) అని వాటిపై రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని