CAT Results 2022: క్యాట్‌ ఫలితాల విడుదల

ఐఐఎంలు, ఇతర మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (క్యాట్‌) ఫలితాలను ఐఐఎం, బెంగళూరు బుధవారం విడుదల చేసింది.

Updated : 22 Dec 2022 07:38 IST

దేశంలో 11 మందికి 100 పర్సంటైల్‌
వీరిలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐఎంలు, ఇతర మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (క్యాట్‌) ఫలితాలను ఐఐఎం, బెంగళూరు బుధవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 11 మంది 100, 22 మంది 99.99 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించారు. 100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థుల్లో ఇద్దరు తెలంగాణకు చెందిన వారున్నారు. టాపర్ల పేర్లను ఐఐఎం, బెంగళూరు వెల్లడించకపోవడంతో వారి వివరాలు తెలియరాలేదు. నవంబరు 27న ‘క్యాట్‌’ నిర్వహించగా  2.22 లక్షల మంది హాజరయ్యారు. ఈ స్కోర్‌ ఆధారంగా ఐఐఎంలు బృంద చర్చలు, ముఖాముఖి నిర్వహించి సీట్లు ఇస్తాయి. హైదరాబాద్‌ వాసవి ఇంజినీరింగ్‌ కళాశాల కోచింగ్‌ తీసుకున్నవారిలో 10 మంది 95, ఆపై పర్సంటైల్‌ దక్కించుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు. వీరిలో శుభం పటేల్‌ 99.60 పర్సంటైల్‌ పొందారు. హైదరాబాద్‌కు చెందిన బండి హర్షిణి 99.33 పర్సంటైల్‌ సాధించారు. 96, ఆపై పర్సంటైల్‌ వస్తే రిజర్వేషన్‌ లేకున్నా ఐఐఎంలలో సీటు వచ్చే అవకాశం ఉంటుందని, రిజర్వేషన్‌ ఉంటే 90కిపైగా పర్సంటైల్‌ దక్కినవారికి సీట్లు వస్తాయని ‘క్యాట్‌’ నిపుణుడు శరత్‌ తెలిపారు.

* 100 పర్సంటైల్‌ సాధించిన వారిలో తెలంగాణ, దిల్లీ, మహారాష్ట్రలకు చెందిన వారు ఇద్దరేసి చొప్పున.. గుజరాత్‌, హరియాణా, కేరళ, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే నాన్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థి.

* 99.98 నుంచి 100 మధ్య పర్సంటైల్‌ సాధించిన వారు 55 మంది ఉన్నారు. వారిలో నలుగురు అమ్మాయిలు. టాపర్లలో 75 శాతం మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లే. అభ్యర్థుల్లో అమ్మాయిలు 35%, అబ్బాయిలు 65% ఉన్నారు. క్యాట్‌ స్కోర్‌ను ఐఐఎంలు కాకుండా 90 ఇతర విద్యాసంస్థలు వినియోగించుకొని సీట్లను భర్తీ చేసుకుంటాయి.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని