BF7: బీఎఫ్‌ 7పై ఆందోళన వద్దు

గత ఏడాది జులై, ఆగస్టు నెలల నాటి మూడోదశ కొవిడ్‌ ఉద్ధృతి నుంచి నెమ్మదిగా తేరుకుంటున్న సమయంలో.. ఇప్పుడు నాలుగో దశ మొదలవుతోందన్న సంకేతాలతో ప్రజల్లో ఆందోళన పెరిగింది.

Updated : 23 Dec 2022 10:55 IST

అధిక జనసాంద్రత ప్రాంతాల్లో కేసులు పెరిగే అవకాశాలు
మాస్కు తప్పనిసరిగా ధరించాలి
బూస్టర్‌ డోసు టీకాతో కచ్చితమైన రక్షణ
‘ఈనాడు’తో ఇన్‌ఫెక్షన్‌ వ్యాధుల నిపుణురాలు డాక్టర్‌ సునీత నర్రెడ్డి

ఈనాడు- హైదరాబాద్‌: గత ఏడాది జులై, ఆగస్టు నెలల నాటి మూడోదశ కొవిడ్‌ ఉద్ధృతి నుంచి నెమ్మదిగా తేరుకుంటున్న సమయంలో.. ఇప్పుడు నాలుగో దశ మొదలవుతోందన్న సంకేతాలతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ప్రస్తుతం దేశంలో బయటపడుతున్న కొత్తరకం ఒమిక్రాన్‌ వైరస్‌ బీఎఫ్‌ 7 రకం భయభ్రాంతులకు గురిచేస్తోంది. చైనాలో విరుచుకుపడుతున్న ఈ వైరస్‌ కేసులు భారత్‌లోనూ వెలుగు చూశాయి. ఈ వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెంది అత్యధిక మరణాలకు దారితీస్తోందని, దీని లక్షణాలు సాధారణ కొవిడ్‌ మాదిరిగా కనిపించవని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరందుకోవడంతో.. జనం బెంబేలెత్తే పరిస్థితి. ఈ ప్రచారంలో వాస్తవాలు లేవని, వాటిలో శాస్త్రీయత లేదని ఇన్‌ఫెక్షన్‌ వ్యాధుల (ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌) నిపుణురాలు, అపోలో ఆసుపత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సునీత నర్రెడ్డి కొట్టిపారేశారు. చైనాలో విజృంభించినంతగా బీఎఫ్‌ 7 ఉద్ధృతి మన దగ్గర కొనసాగే అవకాశాలు తక్కువని చెప్పారు. కానీ దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా వంటి జనసాంద్రత అధికంగా ఉండే మహానగరాల్లో కేసుల సంఖ్య అమాంతం పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషించారు. ఈ వైరస్‌పై నెలకొన్న సందేహాలను ఆమె ‘ఈనాడు’ ముఖాముఖిలో నివృత్తి చేశారు.

చైనాలో విజృంభిస్తున్న బీఎఫ్‌ 7 రకానికి చెందిన ఒమిక్రాన్‌ వైరస్‌ ప్రభావం మన దగ్గర ఎలా ఉండబోతోంది?

చైనాలో మొదట్నించీ లాక్‌డౌన్‌ నడుస్తోంది. అక్కడి ప్రజల్లో వైరస్‌ బారినపడిన వారి శాతం చాలా తక్కువ. దీంతో సహజసిద్ధంగా లభించే రోగ నిరోధక శక్తి చైనీయుల్లో కొరవడింది. వైరస్‌ మార్పులకు అనుగుణంగా ఆ దేశ టీకాలను అభివృద్ధి చేయకపోవడంతో అవి కొత్త వేరియంట్లను అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయి. ఇలా రెండు రకాలుగా చైనా ప్రజల్లో రోగనిరోధకశక్తి సన్నగిల్లడంతో వైరస్‌ విజృంభిస్తోంది. భారత్‌లో రెండోదశలో డెల్టా వేరియంట్‌ వ్యాపించిన సందర్భంలో మనం చూసిన తీవ్రతనే ఇప్పుడు చైనాలోనూ ఎదుర్కొంటున్నారు. మన దేశంలో దాదాపు అర్హులైన వారంతా రెండు డోసుల టీకాలు పొందారు. పెద్దఎత్తున ఇన్‌ఫెక్షన్‌ బారిన కూడా పడ్డారు. దీంతో సహజసిద్ధంగా లభించే హెర్డ్‌ ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంది. బీఎఫ్‌ 7 అనేది భారత్‌లో కొత్తగా వచ్చిందేమీ కాదు. సెప్టెంబరు నుంచే ఇక్కడ వ్యాప్తిలో ఉంది. మూడు నెలలు దాటినా, ఉద్ధృతి కనిపించలేదు. కొత్తగా కేసులు పెరిగేదేముంది?

కొవిడ్‌ తొలిదశలో.. చైనాలో మన కంటే ముందుగా నవంబరు 2019లో వైరస్‌ విజృంభించింది. తర్వాత భారత్‌లో 2020 మార్చి, ఏప్రిల్‌లో వైరస్‌ జాడలు కనిపించాయి. ఇప్పుడు కూడా అలా వచ్చే నాలుగైదు నెలల్లో వ్యాప్తి పెరిగే అవకాశాలున్నాయా?

ఇప్పుడు కొత్త రకం వైరస్‌ భారత్‌లో ప్రవేశించి మూణ్నెల్లు దాటినా కేసుల సంఖ్యలో అనూహ్య పెరుగుదల లేదు. కొవిడ్‌కు ముందు మాదిరే ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటే.. దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువే. ఒకవేళ పెరిగితే వచ్చే జనవరికల్లా తెలుస్తుంది. కానీ 2020, 2021లో మాదిరిగా కేసులు పెరగవు. మన దగ్గర వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువే. మనవద్ద ఎప్పటికప్పుడు వైరస్‌ జన్యుక్రమ విశ్లేషణ (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌) పరీక్షలు జరుగుతున్నాయి. వాటిలో ఏదైనా కొత్తరకం ప్రమాదకరంగా ఉందని తేలితే.. వెంటనే అప్రమత్తమయ్యేందుకు భారత్‌లో అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో పటిష్ఠ యంత్రాంగాన్ని నెలకొల్పింది.

అమెరికా, యూరప్‌ దేశాల్లోనూ వ్యాక్సిన్లు ఇచ్చారు.. అయినా అక్కడ ఎందుకు కేసులు పెరుగుతున్నాయి?

రెండు, మూడు దశల కొవిడ్‌ తీరును పరిశీలిస్తే.. మన కంటే అమెరికా, యూరప్‌ దేశాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికాలో పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. ఆ దేశాల కంటే మన దగ్గర మరణాలు, తీవ్రత తక్కువే. బహుశా ఉష్ణ ప్రాంతాల్లో ఉండడం వల్ల కావచ్చు.. భారత్‌ వంటి దేశాల్లో జనం చిన్నతనం నుంచే రకరకాల అంటువ్యాధుల బారినపడుతుంటారు. అందుకే వారిలో సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తి వృద్ధి చెంది ఉండొచ్చని ఒక అంచనా.

బీఎఫ్‌ 7 రకం ఒమిక్రాన్‌లో గతంలో మాదిరి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉండవు అనే ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంత?

బీఎఫ్‌ 7 దగ్గు, జ్వరం రావని.. కీళ్ల నొప్పులు, తల, మెడ, వీపునొప్పి, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలతో బయటపడుతుందని, డెల్టా కంటే 5 రెట్లు ప్రమాదకరమైందని కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అత్యధిక మరణాలు సంభవిస్తాయనే భయాందోళనలు సృష్టిస్తున్నారు. ముక్కుద్వారా చేసే పరీక్షల్లోనూ బయటపడదని, నొప్పులు లేకుండా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని, ఎక్స్‌రేలో మాత్రం ఛాతీలో న్యుమోనియా ఉన్నట్లు బయటపడుతుందని అపోహలు కల్పిస్తున్నారు. ఇవన్నీ అవాస్తవాలే. బీఎఫ్‌ 7 సోకితే.. సాధారణ కొవిడ్‌ లక్షణాలే ఉంటాయి. ముక్కుద్వారా సేకరించే నమూనాల్లోనే బయటపడుతుంది.

ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఆందోళన అవసరం లేదు. అలా అని  ఉదాసీనంగా వ్యవహరిస్తే వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కనీస జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందే. మాస్కులు తప్పనిసరి. జన సమూహాల్లోకి వెళ్లకూడదు. భౌతికదూరం పాటించాలి. తరచూ చేతులు శుభ్రపర్చుకోవాలి. 2 డోసుల టీకా వేసుకున్న తర్వాత కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడంతో చాలామంది బూస్టర్‌డోసు తీసుకోలేదు. అలాంటి వారంతా తప్పకుండా బూస్టర్‌డోసు వేయించుకోవాలి. రెండు డోసులు పూర్తయి చాలాకాలమైనా.. బూస్టర్‌ తీసుకుంటే రక్షణ లభిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలుంటే.. వెంటనే కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. నెగెటివ్‌ అని తేలితేనే బయటకు రావాలి. లేదంటే లక్షణాలు తగ్గేవరకు ఇంటి పట్టునే వైద్యం పొందుతూ ఉండాలి. ఆరోగ్యం విషమిస్తున్నట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్చాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని