వీడని అకాల వర్షం
వేసవి కాస్త వర్షాకాలంలా మారింది. ఏసీలు.. కూలర్లతో సేదతీరాల్సిన తరుణంలో చలి వాతావరణం నెలకొంది. శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.
సూర్యాపేట జిల్లాలో గరిష్ఠంగా 7.6 సెం.మీ నమోదు
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వడగళ్లు
చేతికొచ్చే దశలో పంట నష్టం
నేడూ వానలు కురిసే అవకాశం
ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, యంత్రాంగం: వేసవి కాస్త వర్షాకాలంలా మారింది. ఏసీలు.. కూలర్లతో సేదతీరాల్సిన తరుణంలో చలి వాతావరణం నెలకొంది. శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పలుజిల్లాల్లో వడగళ్లు పడటంతో పంట, ఆస్తినష్టం సంభవించింది. ఉదయం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం అలంగపురంలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వడగళ్లతో బెంబేలు
రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వడగళ్లు పడ్డాయి. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో వడగళ్లు పడటంతో ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. నగరంలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్ గౌరెల్లిలో వడగళ్ల ధాటికి ఇంటి పైకప్పులు దెబ్బతిన్నాయి. కిలోన్నర నుంచి 2 కిలోల బరువున్న వడగళ్లు రేకుల ఇళ్లపై పడటంతో పైకప్పులు జల్లెడల్లా మారాయి. మొత్తం 9 మంది తలలు పగిలాయి. వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.
22 వేల ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రవ్యాప్తంగా వానల వల్ల శుక్రవారం 22 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. రూ.80 కోట్ల మేర పంటనష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదికను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదికను రూపొందించారు. వికారాబాద్, సంగారెడ్డితో పాటు ములుగు, భద్రాద్రి, భూపాలపల్లి, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, వరి, మిర్చి, వేరుసెనగ, మినుము పంటలతో పాటు మామిడి, బత్తాయి, టమాటా, బీర, పుచ్చతోటలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని 62 గ్రామాల్లో 2633 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, మామిడి, ఉల్లి, టమాటా, పుచ్చ తదితర పంటలకు నష్టం వాటిల్లింది. వికారాబాద్ జిల్లాలో 1516 మంది రైతులు 3193 ఎకరాల్లో కోటి రూపాయలకు పైగా విలువైన పంటను కోల్పోయారు. టమాటా, ఉల్లి, వంగ, మామిడి, అరటి, మిర్చి, క్యాబేజీ పంటలు దెబ్బతిన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1923 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం 3012, ఉమ్మడి నల్గొండ 3130, ములుగు 1921, భూపాలపల్లి జిల్లాలో 913 ఎకరాల్లో పంట నష్టం కలిగింది. ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో నష్టపోయామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
పంట నష్టంపై సర్వే చేయాలి: కూనంనేని
ఈనాడు, హైదరాబాద్: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలపై సర్వే చేసి, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శనివారం ఓ ప్రకటనలో కోరారు. ఎకరాకు రూ.50 వేలు పరిహారం అందించాలన్నారు. పిడుగుపాటుతో చనిపోయిన మూగజీవాలకు, పశుకాపరులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు.
పడిపోయిన ఉష్ణోగ్రతలు
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గత పదేళ్లలో లేనంతగా పగటిపూట రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శనివారం నల్గొండలో సాధారణం కన్నా 9.4 డిగ్రీల సెల్సియస్ తగ్గి 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో సాధారణం కన్నా 7.3 డిగ్రీలు తగ్గి 30.8, హైదరాబాద్‌లో 6.7 డిగ్రీలు తగ్గి 29.9, రామగుండంలో 6.6 డిగ్రీలు తగ్గి 31.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి.
నేడు కూడా వర్షాలు
రాష్ట్రంలో ఆదివారం కూడా పలుచోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రభావం ఉంటుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని, కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కురుస్తాయని చెప్పారు. సోమవారం కూడా అక్కడక్కడా తేలికపాటి వానపడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంపై ఏర్పడిన ద్రోణి ప్రభావం కొంతవరకు తగ్గిందని అంచనా వేస్తున్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 8.3 మిల్లీమీటర్లు కాగా 15.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో 605 శాతం, రంగారెడ్డి 412, ఖమ్మం 365, వికారాబాద్ 348, వనపర్తిలో 286 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Smyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Mission venus: 2028లో శుక్రగ్రహ మిషన్!: ఇస్రో అధిపతి సోమనాథ్
-
Ap-top-news News
AP High Court: క్రిమినల్ కేసు ఉంటే కోర్టు అనుమతితోనే పాస్‌పోర్టు పునరుద్ధరణ: హైకోర్టు
-
Sports News
Suryakumar Yadav: హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్